పంజాబ్ నిలిచె..
ABN , Publish Date - May 24 , 2026 | 03:24 AM
ట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఊపిరిపీల్చుకుంది. లీగ్ తొలి దశలో అందరికంటే ముందు దూసుకెళ్లిన ఈ జట్టు వరుసగా ఆరు పరాజయాలతో డీలా పడింది. ఇక ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకోవాలంటే తమ ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా.....
ఆఖరి మ్యాచ్‌లో అద్భుత విజయం
నేడు రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్స్‌కు?
శ్రేయాస్ అజేయ సెంచరీ
అట్టడుగున లఖ్‌నవూ
లఖ్‌నవూ: ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఊపిరిపీల్చుకుంది. లీగ్ తొలి దశలో అందరికంటే ముందు దూసుకెళ్లిన ఈ జట్టు వరుసగా ఆరు పరాజయాలతో డీలా పడింది. ఇక ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకోవాలంటే తమ ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిన వేళ.. పంజాబ్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్) అద్భుత సెంచరీతో తమ జట్టును రేసులో నిలిపాడు. శనివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్లతో నెగ్గింది. దీంతో 15 పాయింట్లతో లీగ్ దశను ముగించింది. మ్యాచ్‌లో ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఇన్‌గ్లిస్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72), ఆయుష్ బదోని (18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), అబ్దుల్ సమద్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) రాణించారు. చాహల్, యాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్‌సిమ్రన్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) అర్ధసెంచరీ సాధించాడు. షమి 2 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా శ్రేయాస్ నిలిచాడు.
శతక భాగస్వామ్యంతో..: ఛేదనలో శ్రేయాస్ అదరగొట్టాడు. అతడికి ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ చక్కటి సహకారం అందించడంతో పంజాబ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించింది. అయితే ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ప్రియాన్ష్ (0) వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో ఉన్నంత సేపు వేగం కనబర్చిన కూపర్ (18) మూడో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ ఇద్దరినీ షమి వెనక్కిపంపాడు. ఆ తర్వాత శ్రేయా్‌స-ప్రభ్ జోరుకు లఖ్‌నవూ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆరంభం నుంచే శ్రేయాస్ ఫోర్లతో కదం తొక్కాడు. అటు ప్రభ్‌సిమ్రన్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 65/2 స్కోరుతో నిలిచింది. పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తొలి ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చినా తర్వాతి ఓవర్‌లో శ్రేయాస్ 4, ప్రభ్ 4,6తో 15 రన్స్ సమకూరాయి. 12వ ఓవర్‌లో 3 ఫోర్లతో ప్రభ్‌సిమ్రన్ 28 బంతుల్లో.. శ్రేయాస్ 33 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. 15వ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ను అర్జున్ అవుట్ చేసినా అప్పటికే పంజాబ్ గెలుపు ఖాయమైంది. ఈ జోడీ మధ్య మూడో వికెట్‌కు 140 రన్స్ లభించాయి. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడిన శ్రేయాస్ 18వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది లీగ్‌లో తొలి శతకం సాధించడంతో పాటు మ్యాచ్‌ను విజయంతో ముగించాడు.
ఆదుకున్న ఇన్‌గ్లిస్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇన్‌గ్లిస్ కీలకంగా నిలిచి, మధ్య ఓవర్లలో చక్కటి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఇక బదోని ఆరంభంలో ధనాధన్ ఆటను ప్రదర్శించగా.. చివర్లో అబ్దుల్ సమద్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించాడు. ఓపెనర్ మార్ష్ స్వదేశానికి వెళ్లడంతో అర్షిన్ కులకర్ణికి అవకాశమిచ్చారు. తొలి ఓవర్‌లోనే ఇన్‌గ్లిస్ నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కానీ అర్షిన్ (0), పూరన్ (2) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అటు తొలి నాలుగు ఓవర్లలో జట్టు స్కోరు 24/2 మాత్రమే ఉండగా, బదోని గేరు మార్చాడు. ఐదో ఓవర్‌లో 4,4,6,4తో 18 రన్స్.. తర్వాతి ఓవర్‌లో 4,6,6,4తో 24 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేలో ఎల్‌ఎస్‍జీ ఒక్కసారిగా 66/2 స్కోరుకు చేరింది. కానీ అతని దూకుడును స్పిన్నర్ చాహల్ అడ్డుకున్నాడు. ఏడో ఓవర్‌లో కీపర్ ప్రభ్‌సిమ్రన్ మెరుపు వేగంతో స్టంప్ చేయడంతో బదోని నిరాశతో వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు 49 పరుగులు సమకూరాయి. అప్పటివరకు నిదానం కనబర్చిన ఇన్‌గ్లిస్ బ్యాట్ ఝుళిపించాడు. వైశాక్ ఓవర్‌లో 4,6.. అర్ష్‌దీప్ ఓవర్‌లో 6,4,4తో 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పంత్ (26) ఎప్పటిలాగే నిరాశపర్చాడు. 17వ ఓవర్‌లో సమద్ 6,4తో జోరు చూపినా.. అదే ఓవర్‌లో ఇన్‌గ్లిస్ వెనుదిరిగాడు. అనంతరం పట్టు బిగించిన పంజాబ్ బౌలర్లు తర్వాతి 12 బంతుల్లో పది పరుగులే ఇచ్చి.. ముకుల్ (1) వికెట్‌ను తీశారు. చివరి ఓవర్‌లో మాత్రం సమద్ వరుసగా 6,4,4తో 17 రన్స్ రాబట్టడంతో స్కోరు 200 దరిదాపుల్లోకి రాగలిగింది. ఎనిమిదో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (5 నాటౌట్) ఎల్‌ఎ్‌సజీ తరఫున అరంగేట్రం చేశాడు.
నాలుగో బెర్త్ ఎవరిదో?
సస్పెన్స్‌కు నేడు తెర
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో తొలి మూడు బెర్త్‌లు ఖరారయ్యాయి. మిగిలిన నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీపడుతున్నాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూపై గెలిచిన పంజాబ్ మొత్తం 15 పాయింట్లతో ఆశలు సజీవంగా నిలబెట్టుకొంది. ఈ సస్పెన్స్‌కు ఆదివారం రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్‌లతో తెరపడనుంది. 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్, తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైపై నెగ్గితే.. మొత్తం 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకొంటుంది. అప్పుడు పంజాబ్, కోల్‌కతా జట్లు ఎలిమినేట్ అవుతాయి. ఒకవేళ రాజస్థాన్ ఓడితే.. అంతే సంగతులు. రేసు పంజాబ్, కోల్‌కతా మధ్యలో సాగుతుంది. 13 పాయింట్లతో ఉన్న కోల్‌కతా.. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ భారీ తేడాతో గెలిస్తే పాయింట్లను సమం చేయడంతోపాటు నెట్‌రన్ రేట్‌లో పంజాబ్‌ను వెనక్కు నెట్టే అవకాశం ఉంటుంది. ఇక, 12 పాయింట్లతో సాంకేతికంగా రేసులో ఉన్న ఢిల్లీ.. పంజాబ్ విజయంతో టోర్నీ నుంచి అవుటైంది.
1 ఐపీఎల్‌లో తొలి బంతికే ఎక్కువసార్లు (6) వికెట్లు తీసిన బౌలర్‌గా షమి