Share News

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

ABN , Publish Date - May 20 , 2026 | 09:24 PM

గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. టోర్నీ ఆరంభంలో కెప్టెన్‌గా వరుసగా ఏడు మ్యాచ్‌లను గెలిపించాడు. అనూహ్యంగా తర్వాత జట్టు ఓటముల బాట పట్టింది. కానీ బ్యాటర్‌గా అయ్యర్ రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా అతడిని టీమిండియా టీ20 జట్టులోకి తీసుకుని కెప్టెన్సీ ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా దిగ్గజం, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘భారత టీ20 జట్టుకు భవిష్యత్తు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ప్రధాన పోటీదారుల్లో ఒకడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత నాయకత్వంలో శ్రేయస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతడు ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. కెప్టెన్సీ రేసులో పలువురు క్రికెటర్లు ఉన్నారు. కానీ నా దృష్టిల్లో శ్రేయస్ ప్రధాన పోటీదారుడు. ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలోనే అతడు ఎంత గొప్ప టీ20 ప్లేయరో చూపించాడు. ప్లేయర్‌గా మాత్రమే కాదు.. కెప్టెన్సీ పరంగానూ అయ్యర్ అదరగొడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు టైటిల్ అందించాడు. పంజాబ్ కింగ్స్‌లోకి వచ్చిన తొలి సీజన్‌లోనే 11 ఏళ్ల తర్వాత ఫైనల్ వరకు తీసుకెళ్లాడు’ అని పాంటింగ్ వెల్లడించాడు.


ఆశ్చర్యంగా అనిపిస్తుంది..

‘భారత టీ20 జట్టును ప్రకటించిన ప్రతిసారీ శ్రేయస్ అయ్యర్ పేరు కోసం వెతుకుతుంటా. పేరు లేకపోతే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ ఐపీఎల్ ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడమే కాదు.. కెప్టెన్సీ ఇవ్వడం గురించి కూడా ఆలోచిస్తారని భావిస్తున్నా’ అని తెలిపాడు. పంజాబ్ కింగ్స్ వరుస పరాజయాలపై కూడా పాంటింగ్ స్పందించాడు. ‘కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. వ్యక్తిగతంగా, జట్టు పరంగా కూడా అలాంటి పరిస్థితులు వస్తుంటాయి. చివరి మ్యాచ్‌లో అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మా విజయావకాశాలు మెరుగవుతాయి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ను మేం పట్టించుకోము. అందులో చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలో మాకు తెలుసు’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్

Updated Date - May 20 , 2026 | 09:24 PM