బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
ABN , Publish Date - May 20 , 2026 | 02:34 PM
పాకిస్థాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై జరిగిన టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై జరిగిన టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టు ఆది నుంచే పాక్‌పై బంగ్లా ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. తొలి టెస్టులో పాక్ 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
రెండో టెస్టులో 437 పరుగుల లక్ష్య ఛేదనలో 316/7 ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజును ఆట ప్రారంభించిన పాకిస్థాన్.. వెనువెంటనే మిగిలిన 3 వికెట్లను కూడా కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. 75 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన పాక్ స్టార్ బ్యాటర్ రిజ్వాన్(94) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ బంగ్లా బౌలర్ తైజులు ఇస్లాం 6 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్(126) సెంచరీతో అదరగొట్టాడు. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(68) మినహా మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించకపోవడంతో.. పాకిస్థాన్ 232 పరుగులు చేసింది. కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫికర్ రహీం(137) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లా 390 పరుగుల భారీ స్కోర్ చేసి.. మొత్తంగా 437 పరుగుల టార్గెట్‌ను పాక్‌కు నిర్దేశించింది. ఛేదనలో రిజ్వాన్(94), షాన్ మసూద్(71), సల్మాన్ అఘా(71) హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ పాక్‌కు ఓటమి తప్పలేదు.
పాయింట్ల పట్టికలో బంగ్లా హవా..
పాకిస్థాన్‌పై విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో భారత్ ఆరో స్థానానికి పరిమితమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్ 4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. కాగా ఈ గెలుపు బంగ్లాదేశ్‌కు పాక్‌పై వరుసగా నాలుగవది కావడం విశేషం. అంతకు ముందు రెండు టెస్టులను పాక్ గడ్డపైనే బంగ్లా గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్.. పాక్‌ను వన్డే సిరీస్‌లోనూ ఓడించింది.
ఇవి కూడా చదవండి:
సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్
వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే