Share News

అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ

ABN , Publish Date - May 20 , 2026 | 03:07 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2022లో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీని వదిలేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పుడు తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా విరాట్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్టు క్రికెట్ వైపు ఆకర్షించి, వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసిన ఘనత.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీది. 2022 జనవరిలో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు ఏడేళ్ల పాటు భారత టెస్టు జట్టుకు విరాట్ నాయకత్వం వహించాడు. ఆడిన 68 మ్యాచుల్లో 40 విజయాలు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. ఉన్నట్టుండి సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్ కెప్టెన్సీ వదిలేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పుడు తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా విరాట్ వివరించాడు.


‘భారత క్రికెట్ జట్టు ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉండాలనే లక్ష్యంతో పని చేశాను. కానీ కెప్టెన్సీ నాపై ఎంతటి మానసిక భారాన్ని మోపిందో అప్పట్లో గ్రహించలేకపోయాను. బ్యాటింగ్ చేయడం, నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం.. ఈ రెండూ నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపాయి. కెప్టెన్సీ వదిలే సమయానికి నేను పూర్తిగా అలసిపోయాను. ఆ బాధ్యతలు నన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. నేను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ నా బ్యాటింగ్‌ మీద ఎక్కువగా అంచనాలుండేవి. ఇది నాలో తీవ్రమైన ఒత్తిడికి కారణమైంది. అందుకే నేను కెప్టెన్సీ బాధ్యతల నుంచి నెమ్మదిగా బయటపడ్డా’ అని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.


వారు నాకు అండగా నిలిచారు..

‘కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత క్లిష్ట దశను ఎదుర్కొన్నా. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ నాకు అండగా నిలిచారు. వారిద్దరితో ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించా. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వారి కోసమే ఆడాలనిపించేలా నాలో ఉత్సాహాన్ని నింపారు. అప్పటి వరకు నేను సాధించిన విజయాలు, రికార్డుల గురించి గుర్తు చేశారు’ అని విరాట్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్

వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే

Updated Date - May 20 , 2026 | 03:25 PM