ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు ఫిల్ సాల్ట్ రీఎంట్రీ!
ABN , Publish Date - May 20 , 2026 | 05:02 PM
ప్లే ఆఫ్స్ సమరం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత ఏడు మ్యాచ్‌లకు దూరమైన ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ప్లే ఆఫ్స్‌కు ముందే జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కాగా నాలుగో స్థానం కోసం పోటీ నెలకొంది. ప్లే ఆఫ్స్ సమరం సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ అందినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత ఏడు మ్యాచ్‌లకు దూరమైన ఆర్సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ప్లే ఆఫ్స్‌కు ముందే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. ఈ వారం చివర్లో సాల్ట్ భారత్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సాల్ట్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి వేలికి గాయం అవ్వడంతో ఏప్రిల్ 18న చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సాల్ట్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సాల్ట్ గైర్హాజరీలో బెథెల్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ అతడు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసిన బెథెల్.. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 96 పరుగులు చేశాడు.
సాల్ట్ రాకతో..
సాల్ట్ తిరిగి జట్టులో చేరితే.. బెథెల్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. సాల్ట్ ఆడిన ఐదు మ్యాచుల్లో 194 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. అయితే కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కూడా గాయపడిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే పాటీదార్ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు టాప్-2లో నిలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ
బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్