Share News

వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్.. ఆ హామీ ఇస్తే కామెంటరీ వదిలేస్తా: మహ్మద్ కైఫ్

ABN , Publish Date - May 20 , 2026 | 03:51 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న భారీ షాట్లపై గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. అతడి బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందంటూ పాక్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్.. ఆ హామీ ఇస్తే కామెంటరీ వదిలేస్తా: మహ్మద్ కైఫ్
Mohammad Kaif

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే వరుసగా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కేవలం 38 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో ఏకంగా 93 పరుగులు చేసి.. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వైభవ్ ఆడుతున్న భారీ షాట్లపై గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. అతడి బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందంటూ పాక్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.


‘ఔట్ ఆర్ నాటౌట్’ అనే ఓ కార్యక్రమంలో వ్యాఖ్యాత జతిన్ సప్రూ.. మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, మహ్మద్ కైఫ్‌లను ‘వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?’ అంటూ ప్రశ్నించాడు. దీనిపై కైఫ్ సీరియస్‌గా స్పందించాడు. ‘అసలు బ్యాట్‌లో ఏఐ చిప్ ఉంటే ప్రయోజనం ఏంటి? అలాంటి చిప్ ఉంటే సెంచరీ బాదేయొచ్చనే హామీ ఎవరైనా ఇవ్వగలరా? ఆ హామీ ఎవరైనా ఇస్తే నేను కామెంటరీనే వదిలేస్తా. ఇంత బాగా ఆడుతున్నప్పుడు అది కేవలం ప్రతిభ వల్లే సాధ్యమవుతుంది. ఏడేళ్ల వయసు నుంచి వైభవ్ కష్టపడి తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. దయచేసి ఆ కుర్రాడికి క్రెడిట్ ఇవ్వండి’ అని కైఫ్ వెల్లడించాడు.


వైభవ్ ‘ఏఐ’ లాంటోడే: ఆకాశ్ చోప్రా

ఈ ప్రశ్నకి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సమాధానం ఇచ్చాడు. ‘ఐదేళ్ల తర్వాత ఏఐ మరింత ముందుకు వెళ్లిపోతుంది. వైభవ్ కూడా అలాంటి ఏఐ మోడల్ లాంటివాడే. 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్‌లో ఇలాంటి విధ్వంసకర ఆటను చూశాం. కానీ ఈ కుర్రాడు క్రికెట్ అరంగేట్రం చేసిన తీరు అద్భుతం. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగితే.. వైభవ్ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. అందుకే నేను వైభవ్ సూర్యవంశీని ‘ఏఐ’ అని పిలుస్తాను’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్

Updated Date - May 20 , 2026 | 03:51 PM