లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా
ABN , Publish Date - May 20 , 2026 | 06:13 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతోంది. జూన్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. జులై 5న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత పురుషుల జట్టు తొలి ప్రపంచ కప్‌ను ఆ మైదానంలోనే ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ వేదికపై టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
‘కపిల్ దేవ్ సారథ్యంలో భారత పురుషుల జట్టు లార్డ్స్ మైదానంలో తొలి ప్రపంచ కప్ గెలిచింది. అదే మైదానంలో మేము కూడా మా తొలి టీ20 ప్రపంచ కప్ గెలిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రపంచ కప్ ముద్దాడిన తర్వాత జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం మేము ఒత్తిడిలో లేము. మరోసారి వరల్డ్ కప్ ముద్దాడే క్షణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నాం. మా జట్టు ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉంది. వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయం సాధించడం మహిళల క్రికెట్‌పై ఎంతో ప్రభావం చూపింది. దాన్ని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. భారత మహిళా జట్టుకు ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. కీలక మ్యాచుల్లో గెలవాలంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా పోరాడే ప్లేయర్లు అవసరం. మా జట్టులో అందరూ అలాంటి ప్లేయర్లే ఉన్నారు. ఆఖరి వరకు పోరాడి విజయం సాధించాలనే కసితోనే ఆడుతాం’ అని జెమీమా వెల్లడించింది.
వైఫల్యాలనే బలంగా మార్చుకున్నా..
తన వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా జెమీమా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘గతంలో ఎన్నో సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నా. కీలక టోర్నీలో రెండుసార్లు డకౌట్ అయ్యా. దానివల్ల ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయా. ఈ సంఘటనలు కాస్త బాధ కలిగించినా.. మానసికంగా నన్ను బలంగా మార్చాయి. కొన్నిసార్లు జీవితంలో మీరు చేయాల్సిందల్లా మొండిగా నిలబడటమే. ఎలాంటి కష్టం ఎదురైనా వెనక్కి తగ్గొద్దు. గత నాలుగేళ్లలో ఎదురైన వైఫల్యాలే నన్ను బలంగా తీర్చిదిద్దాయి’ అని జెమీమా తెలిపింది. వన్డే ప్రపంచ కప్ 2025లో అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించుకున్న జెమీమా.. ఆస్ట్రేలియాపై 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత్ మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో పోటీ పడనుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు టోర్నీని ప్రారంభించనుంది.
ఇవి కూడా చదవండి:
అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ
బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్