వైభవ్ కోసం మూడు ప్రణాళికలు సిద్ధం చేశాం: కమిన్స్
ABN , Publish Date - May 27 , 2026 | 01:41 PM
నేడు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఎస్ఆర్‌హెచ్ నెగ్గాలంటే ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవాలి. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు రంగం సిద్ధమైంది. నేడు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాగా గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కి అర్హత సాధించి అక్కడ గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండు విజయాలు సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఈ కీలక పోరులో నెగ్గి వరుసగా మూడో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే.. ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును హైదరాబాద్ బౌలర్లు అడ్డుకోగలగాలి.
ఈ సీజన్‌లో వైభవ్‌పై సన్‌రైజర్స్‌కు మిశ్రమ అనుభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో అతడిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హైదరాబాద్ బౌలర్లు.. రెండో మ్యాచ్‌లో మాత్రం అతడి విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో వైభవ్ సెంచరీతో చెలరేగిపోయాడు. అయినప్పటికీ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మాత్రం సన్‌రైజర్స్‌కే దక్కింది. ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. వైభవ్‌ను అడ్డుకోవడం కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.
‘బౌలర్‌గా మా బలాలేంటి అనేది తెలుసుకోవడం ముఖ్యం. కానీ ప్రత్యర్థి జట్టులో మ్యాచ్‌ను ఒక్కడే మలుపు తిప్పగల ప్లేయర్ ఉంటే అతడికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. అందుకే వైభవ్ కోసం మూడు ప్రణాళికలు సిద్ధం చేశాం. గత మ్యాచ్‌లో అతడు మా మీద సెంచరీ చేసినా.. కొన్ని దశల్లో మేము అతడిని బాగా కట్టడి చేశాం. కొన్ని సందర్భాల్లో మాత్రం వైభవ్‌ను అడ్డుకోలేకపోయాం. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ప్రతి మ్యాచ్ కొత్తగా మొదలవుతుంది. అయితే గత మ్యాచ్‌ల నుంచి నేర్చుకున్న విషయాలు మాత్రం ఉపయోగపడతాయి. ఆర్ఆర్ ఆటగాళ్లపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. మా ప్లేయర్లు కూడా గత విజయాల అనుభవాన్ని ఉపయోగించుకుంటారు’ అని కమిన్స్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు!
ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!