Share News

ఐపీఎల్ 2026: పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు!

ABN , Publish Date - May 27 , 2026 | 11:33 AM

క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 33 బంతుల్లోనే 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రజత్ పలు రికార్డులు కొల్లగొట్టాడు.

ఐపీఎల్ 2026: పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు!
Rajat Patidar

ఇంటర్నెట్ డెస్క్: క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. పాటీదార్ పవర్ షో కారణంగా.. ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలడంతో.. ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పాటీదార్ అరుదైన టీ20 ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


ఆడిన 14 ఇన్నింగ్స్‌లో పాటీదార్ 486 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడు 41 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్.. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(2023-2024)లో 40 సిక్సర్లు కొట్టాడు. తాజాగా రజత్.. రియాన్ పరాగ్ రికార్డును బ్రేక్ చేశాడు.


ఆ జాబితాలో ఉన్నది ఎవరంటే..

  • రజత్ పాటీదార్- 41 సిక్సర్లు (ఐపీఎల్ 2026)

  • రియాన్ పరాగ్- 40 సిక్సర్లు (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24)

  • శ్రేయస్ అయ్యర్- 39 సిక్సర్లు (ఐపీఎల్ 2025)

  • విరాట్ కోహ్లీ- 38 సిక్సర్లు (ఐపీఎల్ 2016)

  • క్రిస్ గేల్- 37 సిక్సర్లు (సీపీఎల్ 2016)


సెన్సేషనల్ రికార్డులు..

  • గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో రజత్ పాటీదార్ కెప్టెన్సీ పరంగానూ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి రెండు సీజన్లలోనే.. వరుసగా రెండు సార్లు జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనత ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాత్రమే సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్య.. 2022, 2023 సీజన్లలో వరుసగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

  • ఆర్సీబీ తరఫున ఒకటి కంటే ఎక్కువసార్లు ఫైనల్స్‌కు జట్టును చేర్చిన తొలి కెప్టెన్‌గా కూడా పాటీదార్ నిలిచాడు. గతంలో అనిల్ కుంబ్లే(2009), డానియల్ వెటోరి(2011), విరాట్ కోహ్లీ(2016) ఒక్కోసారి మాత్రమే ఆర్సీబీ జట్టును ఫైనల్‌కు చేర్చారు.

  • ఐపీఎల్‌లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలోకి పాటీదార్ చేరిపోయాడు. ఈ ఎలైట్ జాబితాలో పాటీదార్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు.. ఎంఎస్ ధోని(సీఎస్కే- 2010- 2011), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్- 2019, 2020), హార్దిక్ పాండ్య(గుజరాత్ టైటాన్స్- 2022, 2023), శ్రేయస్ అయ్యర్(కేకేఆర్, పంజాబ్- 2024, 2025) ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ సరికొత్త రికార్డు

Updated Date - May 27 , 2026 | 11:36 AM