ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!
ABN , Publish Date - May 27 , 2026 | 10:22 AM
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లీగ్ స్టేజ్ నుంచి అద్భుత ప్రదర్శనలు కనబరుస్తూ వస్తోన్న ఆర్సీబీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే వరుస విజయాల వెనుక ఉన్న వ్యూహాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. జట్టు విజయాల వెనుక ఉన్న రహాస్యాన్ని వెల్లడించాడు.
‘మా విజయాల్లో తెర వెనుక పనిచేస్తున్న సపోర్ట్ స్టాఫ్‌కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. మేము అనుభవంతో బౌలింగ్ చేసి వికెట్లు తీస్తాం. అయితే సపోర్ట్ స్టాఫ్ మాత్రం చాలా చిన్న అంశాలపై కూడా పనిచేసి మాకు సహకారం అందిస్తుంది. మేం డేటా ఆధారంగా పనిచేస్తాం. అదే మా విజయ రహస్యం. కొత్త ప్లేయర్లు ఏదైనా ప్రయత్నిస్తే డేటాను నిశితంగా పరిశీలిస్తాం. దాని బట్టి వ్యూహాలను రూపొందించుకుంటాం. అలా అని వంద శాతం ఆ డేటా మీదే ఆధారపడము. ఈ వికెట్‌పై షార్ట్ లేదా ఫుల్లర్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే బౌండరీలకు బాదే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాటర్లకు స్పేస్ ఇవ్వకుండా.. ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ చేయడంపైనే దృష్టి పెట్టాం. ఫలితం వచ్చింది’ భువీ వెల్లడించాడు.
ఈ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది ఐదోసారి కాగా వరుసగా రెండోసారి. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా సీజన్‌ను ఆరంభించిన బెంగళూరు జట్టు.. వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందేమో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ సరికొత్త రికార్డు