Share News

వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన మ్యాచ్‌ల్లో ఇదొకటి: గిల్

ABN , Publish Date - May 27 , 2026 | 09:29 AM

తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే అని తెలిపాడు

వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన మ్యాచ్‌ల్లో ఇదొకటి: గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. బెంగళూరు బ్యాటర్ల ధాటికి జీటీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కెప్టెన్ రజత్ పాటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 33 బంతుల్లో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో ఏకంగా 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. లక్ష్యఛేదనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్(14), గిల్(2), బట్లర్(29) వెనువెంటనే పెవిలియన్ చేరడంతో గుజరాత్ ఓటమి చాలా ముందుగానై ఖరారైపోయింది. అయితే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే అని తెలిపాడు.


‘12, 13 ఓవర్ల వరకు మా ప్రదర్శన చాలా బాగానే సాగింది. అయితే మా ఫీల్డింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మేం కొన్ని క్యాచ్‌లను వదిలేశాం. మా గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా గొప్పగా లేదు. ఈ మ్యాచ్ నుంచి మేం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వీలైనంత త్వరగా మర్చిపోవాల్సిన మ్యాచుల్లో ఇదొకటి. పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించి ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా ఛేదించగలిగేవాళ్లం. ఫీల్డింగ్ లోపాలపై జట్టు సమావేశాలతో పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో చర్చిస్తాం. ఇది మాకు కలిసి రాని రోజు. రజత్ పాటీదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వ్యక్తిగత స్కోర్ 14, 20 ఉన్నప్పుడు రెండు సార్లు అతడు ఇచ్చిన క్యాచ్‌లు జారవిడిచాం. ఆ తర్వాత రజత్ విజృంభించాడు’ అని గిల్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ఆర్సీబీతో ఓడినప్పటికీ గుజరాత్‌కు ఫైనల్‌ వెళ్లడానికి మరో ఛాన్స్ ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్ పోరులో విజయం సాధించే జట్టుతో జీటీ క్వాలిఫయర్ 2 లో తలపడుతుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ సరికొత్త రికార్డు

Updated Date - May 27 , 2026 | 09:29 AM