రఫ్ఫాడించిన రజత్
ABN , Publish Date - May 27 , 2026 | 03:15 AM
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. కెప్టెన్ రజత్ పటీదార్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు...
ఫైనల్లో బెంగళూరు
92 రన్స్‌తో గుజరాత్ చిత్తు
ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. కెప్టెన్ రజత్ పటీదార్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు బౌలర్ల దూకుడు తోడవడంతో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష పోరులో ఆర్‌సీబీ 92 పరుగులతో భారీ విజయాన్నందుకుంది. ఇక చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్న టైటాన్స్ ఈనెల 29న క్వాలిఫయర్ 2లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు చేసింది. క్రునాల్ పాండ్యా (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), విరాట్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), దేవ్‌దత్ (19 బంతుల్లో 5 ఫోర్లతో 30) వేగం చూపారు. హోల్డర్, రబాడలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తెవాటియా (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 68), బట్లర్ (11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 29) మాత్రమే రాణించగా, ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. డఫీకి 3.. క్రునాల్, రసిఖ్, భువనేశ్వర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా రజత్ నిలిచాడు.
పోరాటమే లేకుండా..: ఆర్‌సీబీ బ్యాటర్లకు అద్భుతంగా సహకరించిన పిచ్.. గుజరాత్ ఇన్నింగ్స్‌లో మాత్రం దెబ్బకొట్టింది. బౌలర్లు టపటపా వికెట్లు తీయగా.. ఒక్కో పరుగు కోసం చెమటోడ్చింది. దీంతో 255 పరుగుల కష్టసాధ్యమైన ఛేదనలో గుజరాత్ పవర్‌ప్లేలోనే సగం జట్టును కోల్పోవడం గమనార్హం. చివర్లో తెవాటియా బ్యాట్ ఝుళిపించినా.. అప్పటికే జట్టు ఓటమి ఖరారైంది. అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్న సాయి సుదర్శన్-గిల్ (2) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరారు. బట్లర్ బౌండరీలతో ఆకట్టుకున్నా అతడి ఆట 11 బంతులకే పరిమితమైంది. నిశాంత్ (5), హోల్డర్ (0)ను ఆరో ఓవర్‌లో పేసర్ రసిఖ్ అవుట్ చేయడంతో పవర్‌ప్లేలో 51/5 స్కోరుతో టైటాన్స్‌కు పరిస్థితేమిటో అర్థమైంది. లోయర్ మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు కూడా ఇలా వచ్చి అలా వెళ్లడంతో గుజరాత్ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తెవాటియా ఎడాపెడా బౌండరీలతో స్కోరులో కదలిక తెచ్చాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తెవాటియా ఆటతో గెలుపు అసాధ్యమైనా.. ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగింది. 19వ ఓవర్‌లో భువీ అతడిని అవుట్ చేయగా.. తొమ్మిదో వికెట్‌కు సిరాజ్ (5)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
రజత్ ఎదురుదాడి: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ తొలి ఓవర్ నుంచే చెలరేగింది. బరిలోకి దిగిన ప్రతీ బ్యాటర్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక కెప్టెన్ రజత్ పటీదార్ డెత్ ఓవర్లలో సాగించిన విధ్వంసానికి జట్టు 250 దాటేసింది. అతడికి క్రునాల్ పాండ్యా సహకరించాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 47 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వామ్యం అందించింది. దీనికితోడు గుజరాత్ పేలవ ఫీల్డింగ్ కలిసివచ్చింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19) మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ఆరంభించాడు. రబాడ ఓవర్‌లోనూ సిక్సర్ బాదిన తను అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత దేవ్‌దత్ బ్యాట్ ఝుళిపిస్తూ.. నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. అటు ఓపెనర్ విరాట్ ఆరో ఓవర్‌లో 4,4,6తో అండగా నిలవడంతో పవర్‌ప్లేలో జట్టు 76/1తో నిలిచింది. ఆ తర్వాత 7 నుంచి 10 ఓవర్ల మధ్య పరుగుల వేగం తగ్గింది. పేసర్ హోల్డర్, స్పిన్నర్ రషీద్ పరుగులను కట్టడి చేశారు. తొమ్మిదో ఓవర్‌లో విరాట్, దేవ్‌దత్‌లను హోల్డర్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఈ దశలో రజత్, క్రునాల్ జోడీ జట్టును ఆదుకుంది. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ చెలరేగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. 14వ ఓవర్‌లో రజత్ 20 రన్స్ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను రబాడ వదిలేయడం మలుపు తిప్పింది. అనంతరం జీటీ బౌలర్లకు చుక్కలే కనిపించాయి. 15వ ఓవర్‌లో క్రునాల్ 4,4 రజత్ 4,6,4తో ఏకంగా 28 పరుగులు రాగా, తర్వాత రషీద్ ఓవర్‌లోనూ రజత్ 6,6 క్రునాల్ 6తో 21 రన్స్ సమకూరాయి. 17వ ఓవర్‌లో క్రునాల్‌ను రబాడ అవుట్ చేసినా పటీదార్ రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. టిమ్ డేవిడ్ (4) నిరాశపర్చగా, 19వ ఓవర్‌లో పటీదార్ 6,4 జితేశ్ (15 నాటౌట్) 4,6తో 21 రన్స్.. ఆఖరి ఓవర్‌లో రజత్ రెండు సిక్సర్లతో 19 రన్స్ రాబట్టడంతో ఆర్‌సీబీ అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: వెంకటేష్ (సి) గిల్ (బి) రబాడ 19, కోహ్లీ (బి) హోల్డర్ 43, పడిక్కళ్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 30, రజత్ పటీదార్ (నాటౌట్) 93, క్రునాల్ (సి) సుదర్శన్ (బి) రబాడ 43, డేవిడ్ (బి) ప్రసిద్ధ్ 4, జితేష్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 254/5; వికెట్ల పతనం: 1-21, 2-93, 3-94, 4-189, 5-214; బౌలింగ్: సిరాజ్ 3-0-46-0, రబాడ 4-0-54-2, హోల్డర్ 4-0-39-2, రషీద్ 3-0-29-0, ప్రసిద్ధ్ 4-0-53-1, కుల్వంత్ 2-0-31-0.
గుజరాత్: సాయి సుదర్శన్ (హిట్ వికెట్) (బి) డఫీ 14, గిల్ (బి) భువనేశ్వర్ 2, బట్లర్ (బి) హాజెల్‌వుడ్ 29, నిషాంత్ సింధు (సి అండ్ బి) రసిఖ్ 5, వాషింగ్టన్ (సి) హాజెల్‌వుడ్ (బి) డఫీ 8, హోల్డర్ (సి) హాజెల్‌వుడ్ (బి) రసిఖ్ 0, తెవాటియా (సి) పటీదార్ (బి) భువనేశ్వర్ 68, రషీద్ (సి) జితేష్ (బి) డఫీ 8, రబాడ (సి) కోహ్లీ (బి) క్రునాల్ 9, సిరాజ్ (సి) డేవిడ్ (బి) క్రునాల్ 5, ప్రసిద్ధ్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 162 ఆలౌట్; వికెట్ల పతనం: 1-17, 2-27, 3-51, 4-51, 5-51, 6-65, 7-78, 8-88, 9-156, 10-162; బౌలింగ్: డఫీ 4-0-39-3, భువనేశ్వర్ 4-0-28-2, హాజెల్‌వుడ్ 4-0-39-1, రసిఖ్ 3-1-24-2, క్రునాల్ 3.3-0-16-2, షెఫర్డ్ 1-0-15-0.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!