శ్రేయస్ అయ్యర్ ఎక్కడ?.. కేకేఆర్ ఎక్స్ పోస్ట్‌పై అభిమానుల ఆగ్రహం!
ABN , Publish Date - May 27 , 2026 | 12:57 PM
కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తాజాగా కేకేఆర్ తమ ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఓ వివాదం తెరపైకి వచ్చింది. కేకేఆర్ చేసిన ఆ పోస్ట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు తమ మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దాదాపు పదేళ్ల తర్వాత 2024లో అప్పటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. కేకేఆర్‌కు కప్పును అందించాడు. తాజాగా కేకేఆర్ తమ ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఓ వివాదం తెరపైకి వచ్చింది. కేకేఆర్ చేసిన ఆ పోస్ట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అసలు ఏమైందంటే..
2024 ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మూడోసారి ఐపీఎల్ కప్పు నెగ్గింది. ఆ విజయానికి రెండేళ్లు అవ్వడంతో కేకేఆర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ల ఫొటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆ టైటిల్ విజయంలో జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఏ ఫొటోలోనూ కనిపించలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో కేకేఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్‌కు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ ఎక్కడ?’, ‘శ్రేయస్‌ను ఎందుకు పక్కన పెడుతున్నారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
2025 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. టైటిల్ గెలిపించిన నాయకుడిని వదులుకోవడం సరైన నిర్ణయం కాదంటూ అప్పట్లోనూ విమర్శలు వచ్చాయి. అనంతరం అయ్యర్ పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఇక ఐపీఎల్ 2026లో అజింక్య రహానె నాయకత్వంలో బరిలోకి దిగిన కేకేఆర్.. ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు విజయాలతో లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ కూడా ఆశాజనక ఆరంభం చేసినప్పటికీ.. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పాటీదార్ పవర్ షో.. ప్రపంచ రికార్డు బద్దలు!
ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయ రహస్యాన్ని చెప్పేసిన భువీ!