Share News

కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టారా? ఆర్సీబీ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 09 , 2026 | 07:46 AM

కోహ్లీ కెప్టెన్సీకి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలపై ఆర్సీబీ మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ సంచలన విషయాలను వెల్లడించాడు. 2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు తనను కెప్టెన్సీకి సిద్ధంగా ఉండాలని చెప్పారని, అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని తెలిపాడు.

కోహ్లీ కెప్టెన్సీకే ఎసరు పెట్టారా? ఆర్సీబీ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే మొదట గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ జట్టుతో అనుబంధం కొనసాగిస్తున్న కోహ్లీ.. 2013 నుంచి 2021 వరకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. 2025లో రజత్ పాటీదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని అందుకున్న బెంగళూరు జట్టు.. 2026లోనూ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీకి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలపై ఆర్సీబీ మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ సంచలన విషయాలను వెల్లడించాడు.


‘2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ విషయంలో నాతో చర్చలు జరిపారు. నన్ను కెప్టెన్సీ బాధ్యతలకు సిద్ధంగా ఉండాలి చెప్పారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయం గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే మొయిన్ అలీ ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించాడు. నాకీ విషయం చెప్పిన ఆశిష్ నెహ్రా, గ్యారీ క్రిస్టెన్ స్థానాల్లో కొత్త కోచ్‌లు వచ్చారు. ఆ సీజన్‌లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు’ అని పార్థివ్ వివరించాడు. పార్థివ్ వ్యాఖ్యలతో అప్పట్లో ఆర్సీబీ నాయకత్వ మార్పుపై జరిగిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే తుది నిర్ణయం తీసుకున్నారా? లేదా? అనే విషయంపై పార్థివ్ స్పష్టంగా వెల్లడించలేదు.


మొయిన్ అలీ ఏమన్నాడంటే?

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ గతంలోనే ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అవును.. పార్థివ్‌ను కెప్టెన్‌గా నియమించే ఆలోచన ఉన్నట్లు నాకు బలంగా గుర్తుంది. గ్యారీ క్రిస్టన్ ఉన్న చివరి ఏడాది తర్వాత పార్థివ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావించారు. అతడికి క్రికెట్‌పై అద్భుతమైన అవగాహన ఉంది. అప్పట్లో ఈ విషయం గురించి చర్చ జరిగింది. కానీ ఆ ఆలోచన ఎందుకు కార్యరూపం దాల్చలేదో నాకు తెలియదు. అయితే కెప్టెన్సీ కోసం అతడిని తీవ్రంగా పరిశీలించినట్లు మాత్రం నాకు అనిపించింది’ అని మొయిన్ అలీ తెలిపాడు. 2019లో కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగినప్పటికీ కోహ్లీనే జట్టు సారథిగా కొనసాగాడు. 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

సినిమాలు పక్కనపెట్టి సైన్యంలోకి.. కార్గిల్‌ వీరుడిగా నానా పటేకర్‌

ఈసీపై ఇండియా కూటమి పోరు.. ‘ముందు లంచ్‌.. తర్వాత నిరసన’ ఫార్ములా!

Updated Date - Oct 09 , 2026 | 07:47 AM