Share News

వైభవ్‌ను ఆడిస్తారా?

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:24 AM

వరుస టీ20 విజయాల ఊపులో ఉన్న భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది.

వైభవ్‌ను ఆడిస్తారా?

  • జోష్‌లో టీమిండియా జూనేడు విండీస్‌తో రెండో టీ20

రాంచీ: వరుస టీ20 విజయాల ఊపులో ఉన్న భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది. తాజాగా శుక్రవారం ఇరు జట్ల మధ్య జార్ఖండ్‌ డైనమైట్‌ ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీలో రెండో టీ20 జరుగనుంది. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ అదిరే సెంచరీతో తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం అందుకున్న విషయం తెలిసిందే. అలాగే రాంచీలోనూ అదే జోరును టీమ్‌ కొనసాగించాలనుకుంటోంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతుల్లో ఓటమి తర్వాత శ్రేయాస్‌ సేన వరుసగా 10 టీ20ల్లో విజయభేరి మోగించింది. బుమ్రా, హార్దిక్‌, వరుణ్‌ లేకపోయినా తమ ఆధిపత్యానికి ఢోకా లేకుండా పోయింది. అటు విండీస్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగితేనే ఆతిథ్య జట్టును నిలువరించగలదు. భారత జట్టు ఈ వేదికపై నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. చివరిసారి 2023లో తలపడింది. ఆ నాలుగు మ్యాచ్‌ల్లో సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 161.


శాంసన్‌కు కీలకం

9, 7, 2, 11.. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఇటీవలి టీ20 స్కోర్లివి. ఈ నిలకడలేమితో తను ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అటు జట్టులో చోటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల వైభవ్‌ నుంచి తనకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అభిషేక్‌ ఎదురుదాడికి శాంసన్‌ నుంచి సహకారం లేకపోవడంతో శుభారంభాలు అందడం లేదు. దీంతో తొలి బంతి నుంచే విరుచుకుపడే వైభవ్‌ను రెండో టీ20లో ఆడించే సాహసం చేస్తారా? లేక శాంసన్‌కు మరో అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన వైభవ్‌ కూడా అంతర్జాతీయ వేదికలపై అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి చేసింది 95 పరుగులే. మరోవైపు ఇషాన్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయాస్‌ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మిడిలార్డర్‌లో తిలక్‌ వర్మ అండగా ఉండనున్నాడు. అటు పేస్‌ కాంబినేషన్‌ను కూడా మార్చే చాన్సుంది. మయాంక్‌ యాదవ్‌ ఏమ్రాతం ప్రభావం చూపకపోగా ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. తన స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ను ఆడించవచ్చు. స్పిన్‌ విభాగం మాత్రం కుల్దీప్‌, అక్షర్‌, నమన్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది.


బ్యాటింగ్‌ మెరుగైతేనే..

టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే బ్యాటర్లు కలిగిన విండీస్‌ తొలి మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్‌ హోప్‌, రూథర్‌ఫోర్డ్‌ హాఫ్‌ సెంచరీలతో ఎంతగా పోరాడినా మిగతా హిట్టర్లు బ్యాట్లెత్తేశారు. అందుకే శుక్రవారం కమిల్‌, హెట్‌మయెర్‌, షెఫర్డ్‌ చెలరేగితే భారత్‌కు సవాల్‌ ఎదురవుతుంది. వన్డేల్లో ఆకట్టుకున్న ఆమిర్‌ జాంగూను ఆడించాలనుకున్నా కమిల్‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. కానీ తొలి మ్యాచ్‌ ద్వారానే తను అరంగేట్రం చేసినందున మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. బౌలింగ్‌లో మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లను బౌలర్లు ఏమాత్రం ఇబ్బందిపెట్టడం లేదు. శ్రేయాస్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో వీరికి ముచ్చెమటలు పట్టించాడు. ఏదిఏమైనా తమ లోపాలను సరిచూసుకుని రాంచీలో బరిలోకి దిగకపోతే కరీబియన్లకు మరో భంగపాటు తప్పదు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శాంసన్‌/వైభవ్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ (కెప్టెన్‌), తిలక్‌, దూబే, నమన్‌, అక్షర్‌, కుల్దీప్‌, ప్రిన్స్‌, అర్ష్‌దీప్‌.

విండీస్‌: హోప్‌ (కెప్టెన్‌), కమిల్‌, హెట్‌మయెర్‌, పోవెల్‌, రూథర్‌ఫోర్డ్‌, షెఫర్డ్‌, చేజ్‌, స్ర్పింగర్‌, హోసీన్‌, షామార్‌ జోసెఫ్‌, ఫోర్డ్‌.

భారత జట్టు ఇక్కడ చివరిసారి 2023లో టీ20 ఆడింది. వాస్తవానికి రాంచీలో భారీ స్కోర్లు అరుదుగా నమోదవుతాయి. ఇక్కడ జరిగిన 10 టీ20ల్లో ఒక్కసారి మాత్రమే 200 స్కోరు సాధించారు. సగటు స్కోరు 161 మాత్రమే.

Updated Date - Oct 09 , 2026 | 01:28 AM