Mustafizur Rehman: ఇండియా వద్దంటే.. పాకిస్థాన్‌లో ఆడతా: ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:45 AM
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్తాఫిజుర్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ(BCCI) ఆదేశాల మేరకు రూ.9.2కోట్లకు వేలంలో దక్కించుకున్న అతడిని కేకేఆర్ విడుదల చేసింది. అయితే ముస్తాఫిజుర్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ బంగ్లా పేసర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో చేరాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పీఎస్‌ఎల్‌లో ముస్తాఫిజుర్ అడుగు పెట్టనున్నాడు. ఈ విషయాన్ని లీగ్ నిర్వాహకులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.
ఈ నెల 21న పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్ జరగనుంది. ‘బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి.. న్యూ ఎరాలో ‘ఫిజ్’ తుఫాన్ రాబోతోంది. హెచ్‌బీఎల్ పీఎస్‌ఎల్ 11లో ముస్తాఫిజుర్ రెహమాన్ ఆడనున్నాడు’ అంటూ నిర్వాహకులు పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. గతంలో ముస్తాఫిజుర్(Mustafizur Rehman) లాహోర్ ఖలందర్స్ తరఫున పీఎస్‌ఎల్‌లో ఆడాడు.
ఐసీసీ- బీసీబీ భేటీ వాయిదా!
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌లో బంగ్లాతో జరిగే మ్యాచ్‌లను ఇతర వేదికలు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన డిమాండ్‌పై ఐసీసీతో జరగాల్సిన ఆన్‌లైన్ సమావేశం వాయిదా పడింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం అయినా భారత్‌కు జట్టును పంపాలని ఐసీసీ(ICC) బీసీబీని కోరే అవకాశముందని సమాచారం. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించే అంశంతో సహా పలు ప్రత్యామ్నాయాలపై ఐసీసీ చర్చిస్తోంది. అయితే ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కానుండటంతో షెడ్యూల్, టికెట్లు, ప్రసార హక్కులు వంటి అంశాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుంది. భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు బీసీబీ ప్రతినిధులను భారత్‌కు పంపించాలని ఐసీసీ సూచించే అవకాశమూ ఉంది. ఒకవేళ బీసీబీ అంగీకరించకపోతే, టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించే కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని సమాచారం.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు: హర్భజన్ సింగ్
అన్ని ఫార్మాట్లకు రిటైర్ అవ్వాల్సింది.. కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు