Virat Kohli: అన్ని ఫార్మాట్లకు రిటైర్ అవ్వాల్సింది.. కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:38 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి సులభమైన ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడుతున్నాడని మండిపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వన్డేల్లో అద్భుతంగా రాణించి.. మునపటి ఫామ్ అందుకున్నాడు. తాజాగా దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ శతకం, ఓ అర్ధశతకంతో అద్భుతమైన ఫామ్ కనుబరుస్తున్నాడు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి సులభమైన ఫార్మాట్‌ను ఎంచుకుని ఆడుతున్నాడని మండిపడ్డాడు. యాషెస్ ఐదో టెస్టులో రూట్ సెంచరీ చేసిన నేపథ్యంలో మంజ్రేకర్(Sanjay Manjrekar) స్పందించాడు.
‘జో రూట్ టెస్టుల్లో మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్, విలియమ్సన్, స్మిత్.. వీళ్లు సెంచరీ చేసిన ప్రతిసారీ కోహ్లీ(Virat Kohli) గుర్తొస్తాడు. ఎందుకంటే అతడు టెస్టు క్రికెట్ కోసం ఎంతో శ్రమించాడు. కానీ అప్పుడే టెస్టుల నుంచి రిటైరయ్యాడు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. రిటైర్మెంట్‌కు ముందు ఐదేళ్లు ఎంతో ఇబ్బంది పడ్డాడు. తన సమస్యేంటో, ఐదేళ్లలో తాను 31 సగటు మాత్రమే నమోదు చేయడానికి కారణమేంటో కనుక్కోవడానికి అతడు మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. కష్టపడలేదు. కోహ్లీ అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైరయ్యి ఉంటే బాగుండేది. కానీ అతడు వన్డే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకోవడం నాకు ఎక్కువగా నిరాశను కలిగించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ టాపార్డర్ బ్యాటర్‌కైనా ఈ ఫార్మాట్ చాలా తేలికైంది’ అని మంజ్రేకర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్