Bangladesh Umpires: బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:39 PM
భారత్‌తో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్ల విషయంలో కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్(Mustafizur Rahman)ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ రిలీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. భారత్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి ప్రతిచర్యగా బంగ్లా క్రికెట్ బోర్డు(BCB) కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయడం నుంచి టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు తమ ప్లేయర్లను భారత్‌కు పంపలేమని ఐసీసీకి లేఖ రాయడం వరకు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా బీసీబీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫిబ్రవరిలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2025) టోర్నీకి తమ అంపైర్లను పంపకూడదని బీసీబీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ బంగ్లాదేశ్ అంపైర్లు షర్ఫుద్దౌలా, షాహిద్ సైకత్‌లు ఉన్నారు. వీరు టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాల్సి ఉంది. బీసీబీ తీసుకున్న నిర్ణయం నిజమే అయితే.. ఈ అంపైర్లు ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. వీరిద్దరూ ఐసీసీ ప్యానెల్‌లో ఉన్నందున తుది నిర్ణయం మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకుంటుంది.
అవమానంగా ఫీల్ అవుతున్న బంగ్లా:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తమ దేశ ప్లేయర్ రెహ్మన్ ను బీసీసీఐ అనూహ్యంగా తప్పించడాన్ని బంగ్లాదేశ్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. అందుకే పాకిస్థాన్ తరహాలో భారత్ పై వివిధ రకాల చర్యలకు దిగుతుంది. అందులో భాగంగా.. టీ20 ప్రపంచ కప్ లో తమ దేశం ఆడే మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ శనివారం ఐసీసీకి లేఖ రాసిన బంగ్లాదేశ్.. ఆ వెంటనే ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. తాజాగా తమ దేశ అంపైర్ల(Bangladesh umpires)ను కూడా ఇండియాకు పంపకూడదని యోచనలో బీసీబీ ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్