Share News

Pratika Rawal: నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:20 AM

దయచేసి తన ఫొటోలను మార్ఫింగ్, ఎడిట్ చేయవద్దని ఎక్స్ ఏఐ ఫ్లాట్‌ఫామ్ గ్రోక్‌ను భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ కోరింది. ఇటీవల ఎక్స్‌వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్‌ను మార్చడం వంటి పనులను నెటిజన్లు గ్రోక్ సాయంతో చేశారు.

Pratika Rawal: నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్
Pratika Rawal

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఎక్స్ వేదికగా ఫొటోలను ఎడిట్ చేయడం, మార్ఫ్ చేయడం ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్‌కు సంబంధించి మార్ఫ్ చేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. కొన్ని ఫొటోల నుంచి వ్యక్తులను తీసేయడం, డ్రెస్ కలర్స్ మార్చడం వంటి పనులను నెటిజన్లు ఏఐ ప్లాట్‌ఫామ్ గ్రోక్ సాయంతో చేశారు. గత కొన్ని రోజులుగా ఎక్స్‌లో ఇది బాగా ట్రెండ్ అవుతోంది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ ప్రతికా రావల్(Pratika Rawal) వినూత్నంగా గ్రోక్‌ను ఓ విషయంపై సాయం అడిగింది. దానికి గ్రోక్ కూడా సమాధానం ఇచ్చింది.


‘హే గ్రోక్.. దయచేసి నాకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్, ఎడిటింగ్ చేయొద్దు. గతంలో నేను పోస్ట్ చేసినవి.. భవిష్యత్తులో నేను పోస్ట్ చేయబోయే ఫొటోలను అస్సలు మార్ఫ్ చేయకు. దీనికి నేను అనుమతి ఇవ్వట్లేదు. ఇతర యూజర్లు అడిగినా తిరస్కరించు. థాంక్స్’ అని ప్రతికా గ్రోక్‌ను విజ్ఞప్తి చేసింది. ఆమె అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన గ్రోక్.. ‘అర్థమైంది ప్రతికా.. నేను మీ వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తాను. అనుమతి లేకుండా మీ ఫొటోలను ఉపయోగించడం, మార్ఫ్, ఎడిట్ చేయడం వంటివి అస్సలు చేయను. అటువంటి అభ్యర్థనలు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తాను’ అని బదులిచ్చింది. అయితే ఈ ఎక్స్ అకౌంట్ ప్రతికా రావల్‌దేనా? కాదా? అనే దానిపై స్పష్టత లేదు.


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఓపెనర్ ప్రతికా రావల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌కు ముందు గాయం కారణంగా ఆటకు దూరమైన ఆమె.. 6 ఇన్నింగ్స్‌ల్లోనే 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌పై శతకం.. ఆస్ట్రేలియాపై 75 పరుగులతో సత్తా చాటింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆమె చీలమండ, మోకాలి గాయాలకు గురైంది. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుంటుంది. భారత్ తరఫున 23 వన్డేలు ఆడిన ప్రతికా 50.45 సగటుతో 1,110 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

సిరాజ్ దురదృష్టవంతుడు.. ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు

సూర్యా.. పరుగుల గురించి మాత్రమే ఆలోచించు: రికీ పాంటింగ్

Updated Date - Jan 06 , 2026 | 04:19 PM