BCB: బీసీసీఐతో మాకు సంబంధం లేదు.. మా భద్రతే మాకు ముఖ్యం: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:42 AM
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపడానికి కుదరని బంగ్లా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయ అంశాలు కాస్తా క్రికెట్‌లోకి చొచ్చుకున్నాయి. ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ ఆడనివ్వకుండా కేకేఆర్ నుంచి రిలీజ్ చేయడమే దీనికి కారణం. అప్పటి నుంచి భారత్-బంగ్లా నడుమ తీవ్ర చిచ్చు రేగింది. అభద్రతాభావం వల్ల తమ ప్లేయర్‌ను మ్యాచులు ఆడనివ్వలేదని.. బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపడం లేదని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ తెలిపారు.
‘మేం మా క్రికెట్ బోర్డులోని సభ్యులందరితో మాట్లాడాం. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు మేం రెండు సమావేశాలు నిర్వహించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా జట్టును ప్రపంచ కప్ ఆడటానికి భారత్‌కు పంపడం సురక్షితం కాదని భావిస్తున్నాం. ఈ విషయంపై మేం ఇప్పటికే ఐసీసీ(ICC)కి మెయిల్ పంపించాం. మాకు భద్రత చాలా ముఖ్యం. ఐసీసీతో మాకు త్వరలోనే సమావేశం ఉంటుందని భావిస్తున్నాం. మా తర్వాతి కార్యాచరణ ఐసీసీ ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో బీసీసీఐ(BCCI)తో మాకు సంబంధం లేదు. బీసీసీఐతో సమాచారాన్ని పంచుకోవడం లేదు. ఎందుకంటే వరల్డ్ కప్ అనేది ఐసీసీ ఈవెంట్. కాబట్టి దానికే కమ్యూనికేట్ చేస్తున్నాం ’ అని అమినుల్ తెలిపారు.
ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. గ్రూప్ సిలో ఆ జట్టు ఫిబ్రవరి 7న తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్‌తో తలపడాల్సి ఉంది. వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం నెల రోజుల సమయమే ఉన్నందున ఇప్పటికిప్పుడు వేదికలను మార్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
సిరాజ్ దురదృష్టవంతుడు.. ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు
సూర్యా.. పరుగుల గురించి మాత్రమే ఆలోచించు: రికీ పాంటింగ్