Yuvraj Singh: ఆరు నెలలకు మించి బతకను అన్నారు.. క్యాన్సర్ నాటి రోజులను గుర్తు చేసుకున్న యువీ!
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:00 AM
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో బాధ పడుతూనే 2011 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా క్యాన్సర్ నాటి రోజులను, తనకు ఎదురైన అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించాడు. క్యాన్సర్‌తో బాధ పడుతూనే. టీమిండియా 2011ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. యువీ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నప్పటికీ.. అతడు పడ్డ కష్టాలు కూడా అంతే ఉన్నాయి. తాజాగా అతడు(Yuvraj Singh) క్యాన్సర్ బారిన పడిన రోజుల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
‘మూడు నుంచి ఆరు నెలలకు మించి బతకను అని డాక్టర్లు చెప్పారు. క్యాన్సర్ ట్యూమర్ నా ఊపిరితిత్తి, హృదయం మధ్యలో ఉందన్నారు. అది నరంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు. ఒకవేళ నేను కీమో థెరపీకి వెళ్లకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు నన్ను హెచ్చరించారు. టెస్టు క్రికెట్ ఆడటం కోసం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సిన సమయంలోనే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నేను దాదాపు ఏడేళ్లు వేచి చూశాను. సుమారు 40 టెస్టులకు బెంచ్‌కే పరిమితం అయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. టెస్టుల్లో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నా. కానీ నేను క్యా్న్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతకు మించి నా ముందు మరో దారి లేకపోయింది’ అని యువీ వివరించాడు.
పునర్జన్మలా అనిపించింది..
‘2011-2012లో అమెరికాలో కీమో థెరపీ చేయించుకున్నా. అప్పుడు డాక్టర్ల మాటలు నాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. నేను క్యాన్సర్‌ను జయించి.. ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోతానని డా.ఐన్‌హార్న్ చెప్పారు. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాక.. ఇకపై క్రికెట్ ఆడొచ్చని వారు చెప్పాక.. అది నాకు పునర్జన్మలా అనిపించింది’ అని యువీ వివరించాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున పలు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడు కేవలం 35 బంతుల్లోనే 77* పరుగులు సాధించాడు. అలాగే వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోర్ 150 పరుగులను ఇంగ్లాండ్‌పై కటక్ వేదికగా 2017లో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు. తర్వాత అదే సంవత్సరం వెస్టిండీస్ టూర్‌లో అతడు చివరిసారిగా మైదానంలో కనిపించాడు. అనంతరం 2019లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు: హర్భజన్ సింగ్
అన్ని ఫార్మాట్లకు రిటైర్ అవ్వాల్సింది.. కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు