Harbhajan Singh: టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు: హర్భజన్ సింగ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:21 AM
టీమిండియాకు ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అయితే అతడి నేతృత్వంలో టెస్టు క్రికెట్‌లో భారత్ తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో టెస్టులకు వేరే కోచ్‌ను నియమించాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఫలితాలే సాధిస్తుంది. కానీ టెస్టుల్లో మాత్రం తీవ్రంగా విఫలమైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో టెస్టులు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వేర్వేరుగా కోచ్‌లను నియమించాలనే చర్చ తెరపైకి వచ్చింది. వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్టు కోచ్ బాధ్యతలు అప్పగిస్తారంటూ వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించాడు.
‘టీమిండియా కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు. కోచ్‌గా ఉండాలంటే మీరు జట్టుతో ఏడాది పాటు ప్రయాణించాలి. వేర్వేరు ఫార్మాట్లకు జట్లను ఎంపిక చేయాల్సి ఉన్నందున ఎల్లప్పుడూ ఆటగాళ్లు ప్రదర్శన గమనిస్తూ ఉండాలి. మ్యాచ్ ఫలితాలపై కూడా దృష్టి పెట్టాలి. గౌతమ్ గంభీర్ మైదానంలోకి వెళ్లి ఆడడు. ఎప్పుడు ఎలా ఆడాలో మాత్రమే చెప్తాడు. క్రికెటర్‌గా కొనసాగినప్పుడు అతడు బాగా ఆడాడు. ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. ప్రతి ఒక్కరూ ఓపిక పట్టాలి. వైట్‌బాల్ క్రికెట్, టెస్టులకు ఇప్పుడు వేర్వేరుగా కోచ్ అవసరం లేదు. కాలక్రమేణా అవసరమైతే ఈ విధానాన్ని అనుసరించవచ్చు. అందులో తప్పేమీ లేదు’ అని భజ్జీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్