హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ట్విస్ట్.. సీఎస్కేతో చర్చలే లేవన్న ముంబై ఇండియన్స్
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:21 PM
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ఎంఐ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకున్న వేళ.. ఆ వార్తలకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చెక్ పెట్టింది. హార్దిక్ విషయంలో సీఎస్కేతో గానీ, మరే ఇతర ఫ్రాంచైజీలతో గానీ ఎలాంటి చర్చలు జరపడం లేదని ఎంఐ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్-2026 సీజన్‌పై సమీక్ష కొనసాగుతోందని, అది పూర్తయ్యాకే జట్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇంతకుముందు హార్దిక్‌కు బదులుగా శివమ్ దూబెతో పాటు మరో ఆటగాడిని ముంబైకి ఇచ్చేలా సీఎస్కే ట్రేడ్ ప్రతిపాదన సిద్ధం చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా ప్రకటనతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఐపీఎల్-2024 నుంచి ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్.. గుజరాత్ టైటాన్స్‌లో చూపిన విజయాలను ముంబైలో పునరావృతం చేయలేకపోయాడు. ఐపీఎల్-2026లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడంతో జట్టులో మార్పులపై ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో కొందరు సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా వినిపించాయి.
అయితే ముంబై యాజమాన్యం మాత్రం ప్రస్తుతం అన్ని అంశాలను సమీక్షిస్తున్నామని, ఎలాంటి ట్రేడ్ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ‘సీజన్ అనంతర సమీక్ష కొనసాగుతోంది. జట్టుకు సంబంధించిన పలు అంశాలను పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఆటగాళ్ల ట్రేడ్ అంశాలపై ఎలాంటి చర్చలు లేవు. సమీక్ష పూర్తయ్యాకే తదుపరి నిర్ణయాలు ఉంటాయి’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
కాగా, హార్దిక్ ముంబై ఇండియన్స్ టాలెంట్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని వీడిన తర్వాత ట్రేడ్ ప్రచారం మరింత జోరందుకుంది. అయినప్పటికీ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి హార్దిక్ కూడా జట్టు ప్రధాన కోర్‌లో భాగమేనని, 2027 మెగా వేలం వరకు ముంబై అతడిపై విశ్వాసం కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!
దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్