అజింక్య రహానెకు పెన్షన్ ఇవ్వనున్న బీసీసీఐ.. నెలకు ఎంతంటే?
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:53 AM
భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానెకు బీసీసీఐ నెలవారీ పెన్షన్ ఇవ్వనుంది. జులై 30న రహానె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున 85 టెస్టులు ఆడినందుకు బీసీసీఐ పెన్షన్ విధానంలో అత్యున్నత విభాగానికి రహానె అర్హత సాధించాడు. దీంతో అతడికి ప్రతి నెల రూ.70 వేల స్థిర పెన్షన్ లభించనుంది.
వాస్తవానికి 2022లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ హయాంలో మాజీ క్రికెటర్ల పెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 85 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ ఆటగాళ్లకు నెలకు రూ.50 వేల పెన్షన్ ఉండగా, దానిని రూ.70 వేలకు పెంచారు. మాజీ క్రికెటర్ల ఆర్థిక భద్రత బీసీసీఐ బాధ్యత అని అప్పట్లో గంగూలీ పేర్కొన్నారు. భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానె.. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రిటైర్‌మెంట్ తర్వాత యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించాలనే ఆసక్తి ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు. అయితే రహానె బీసీసీఐలో కోచ్, సెలక్టర్ లేదా ఇతర అధికారిక బాధ్యతలు స్వీకరిస్తే ఆ పదవికి వేతనం పొందుతున్నంత కాలం నెలవారీ పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. పదవి ముగిసిన తర్వాత మళ్లీ పెన్షన్ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు.. గంభీర్‌కు ఇదే అసలు పరీక్ష!
దులీప్ ట్రోఫీ: సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా రజత్ పాటీదార్