ఇంతకంటే గొప్ప పాట దొరకలేదు.. ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై ధోనీ పోస్ట్ వైరల్!
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:08 PM
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. సీఎస్కే జట్టులో మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ ధోనీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సింపుల్‌గా ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. సీఎస్కే జట్టులో మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుపుతూ ధోనీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సింపుల్‌గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించేందుకు ఆరేళ్ల క్రితం ఉపయోగించిన అదే పాటను మరోసారి ఎంచుకున్నాడు. కొన్ని ఫొటోల స్లైడ్‌షోతో అభిమానులకు వీడ్కోలు సందేశం ఇచ్చాడు. ధోనీ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ధోనీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన కోసం 1976లో విడుదలైన 'కభీ కభీ' సినిమాలోని 'మైనే పల్ దో పల్ కా షాయర్ హూన్' పాటను ఎంచుకున్నాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కూడా ఇదే పాటను ఉపయోగించాడు. అప్పట్లోనూ కొన్ని ఫొటోలను కలిపి సింపుల్ వీడియో రూపంలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆరేళ్ల తర్వాత మరోసారి అదే పాటను ఉపయోగిస్తూ పోస్ట్ పెట్టడం విశేషం.
అప్పటి కోచ్ ఫ్లెమింగ్ నుంచి యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వరకు.. సీఎస్కే సాధించిన ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలకు సంబంధించిన ఫొటోలు, 2023లో గుజరాత్ టైటాన్స్‌పై ఫైనల్లో జడేజా చివరి బంతుల్లో అద్భుతంగా ఆడి చెన్నైకి టైటిల్ అందించిన తర్వాత ధోనీ అతడిని ఎత్తుకున్న దృశ్యాలు.. ఇవన్నీ స్లైడ్ షోలా రూపొందించి పోస్ట్ చేసిన వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోనీ బౌలింగ్ చేస్తున్న వీడియోతో పాటు చెపాక్ స్టేడియం, కిక్కిరిసిన ప్రేక్షక గ్యాలరీలు, పసుపు జెండాలతో సందడి చేసే అభిమానుల చిత్రాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.
నేను తప్పు అని నిరూపించారు..
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ధోనీ ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘అభిమానులు నన్ను తప్పు అని నిరూపించారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇంతకంటే మంచి పాట మరొకటి దొరకలేదు. బహుశా రెండు వెర్షన్లు తయారుచేశారేమో.. నేను తప్పు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని అంగీకరించాలి కూడా!’ అంటూ తనదైన శైలిలో చమత్కరించాడు.
సాక్షి భావోద్వేగ సందేశం
ధోనీ భార్య సాక్షి కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భర్తకు అభినందనలు తెలిపింది. అతడి అద్భుతమైన ఐపీఎల్ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది. ‘కొన్ని అధ్యాయాలు ముగిస్తేనే అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతాయి. ఇన్నేళ్లుగా మాహీని ప్రేమించి, ఆదరించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో చాలామందిని వ్యక్తిగతంగా కలవకపోయినా మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞులమే. కొత్త ఆరంభాలు, కొత్త ప్రయాణాలు, మరెన్నో అందమైన జ్ఞాపకాల కోసం ఎదురుచూస్తున్నాం. నీ గురించి ఎంతో గర్వంగా ఉంది మాహీ’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ