Share News

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:03 PM

భారత స్టార్ షూటర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ షూటింగ్‌ ఫెడరేషన్‌ అథ్లెట్స్‌ కమిటికీకి ఆమె ఎన్నికైంది.

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
Manu Bhaker

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షూటర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత మను భాకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ షూటింగ్‌ ఫెడరేషన్‌ అథ్లెట్స్‌ కమిటికీకి ఆమె ఎన్నికైంది. 2026-2030 కాలానికి పిస్టల్ కేటగిరీలో ఆమె ఎన్నికైనట్లు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడింది. ఈ పదవికి పోటీ చేసిన పది మంది అభ్యర్థుల్లో ఇద్దరిని ఎన్నిక చేయగా.. అందులో మను చోటు దక్కించుకుంది. దోహాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (రైఫిల్/పిస్టల్/షాట్‌గన్) పోటీల సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 13 వరకు ఎన్నికలు జరిగాయి.


నామినేషన్ సందర్భంగా మను భాకర్ తన లక్ష్యాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా షూటర్లకు మరింత మెరుగైన, సహాయకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపింది. అథ్లెట్ల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ షూటింగ్‌ను మరింత ప్రగతిశీలంగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ముఖ్యంగా పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగాన్ని ఒలింపిక్స్‌లో కొనసాగించేలా కృషి చేయాలని ఆమె భావిస్తోంది. ఈ ఈవెంట్‌కు దీర్ఘకాలిక భవిష్యత్తు కల్పించడంతో పాటు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ పోటీల్లో క్రీడాకారులకు అందించే ప్రైజ్‌మనీ పెంచేందుకు ప్రయత్నించనుంది.


గతంలో అభినవ్ బింద్రా..

భారత షూటింగ్ దిగ్గజం, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా కూడా గతంలో ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలో సేవలందించాడు. 2010 నుంచి 2020 వరకు సభ్యుడిగా కొనసాగిన అతడు.. 2014 నుంచి 2018 వరకు కమిటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించాడు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. షూటింగ్‌కు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు ఐఎస్ఎస్ఎఫ్ బ్లూ క్రాస్ పురస్కారం కూడా లభించింది.


ఇంటర్నెట్ డెస్క్:

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్‌మెంట్.. సీఎస్కే మెంటార్‌గా కొత్త బాధ్యతలు

ఐపీఎల్ 2027: గుజరాత్ జట్టులో చేరిన ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలర్

Updated Date - Nov 17 , 2026 | 05:04 PM