Share News

ప్రపంచాన్ని గెలిచిన ధోనీ.. చదువుకోవాలన్న కోరిక తీర్చుకోలేకపోయాడు!

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:41 PM

క్రికెట్‌లో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. కాలేజీ చదువును మాత్రం పూర్తి చేయలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తన డిగ్రీని పూర్తి చేయాలని ప్రయత్నించడం విశేషం.

ప్రపంచాన్ని గెలిచిన ధోనీ.. చదువుకోవాలన్న కోరిక తీర్చుకోలేకపోయాడు!
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఓ విషయంలో మాత్రం అనుకున్నది సాధ్యం కాలేదు. ప్రపంచకప్‌లు గెలిచాడు.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు.. ఒత్తిడిలోనూ మ్యాచ్‌లను ముగించే ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ కాలేజీ చదువును మాత్రం పూర్తి చేయలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తన డిగ్రీని పూర్తి చేయాలని ప్రయత్నించడం విశేషం. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ మైదానంలో అలరించిన ధోనీ తాజాగా ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రస్థానానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ జీవితంలోని ఆసక్తికరమైన చదువు అధ్యాయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


ధోనీ 1999లో రాంచీలోని డీఏవీ జవహర్ విద్యా మందిర్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత గోస్నర్ కాలేజీలో కామర్స్ కోర్సులో చేరాడు. అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఉన్న ఆసక్తి క్రమంగా ప్రొఫెషన్‌గా మారడంతో చదువుకు దూరమయ్యాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోనీ.. 2007లో భారత వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అదే ఏడాది అతడి నాయకత్వంలో టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2008 మార్చి నాటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎదిగాడు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ డిగ్రీ పూర్తి చేయాలన్న కోరికను మాత్రం వదులుకోలేదు. 2008 మార్చిలో సెయింట్ జేవియర్స్ కాలేజీ అప్పటి ప్రిన్సిపాల్ నికోలస్ టేటేను కలిసి బీకాం పూర్తి చేయాలన్న తన ఆసక్తిని వెల్లడించాడు. క్రికెట్ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనల కారణంగా రోజూ కాలేజీకి హాజరుకావడం కష్టమని భావించిన యాజమాన్యం.. దూరవిద్య ద్వారా చదువు కొనసాగించే అవకాశాలను కూడా పరిశీలించింది.


2008 సెప్టెంబర్‌లో ధోనీ రాంచీలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో మళ్లీ చేరాడు. ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ స్పెషలైజేషన్‌తో మూడేళ్ల బీకాం వొకేషనల్ కోర్సును ఎంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ కాలేజీలో చేరడంతో అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిభావంతమైన క్రీడాకారుల కోటాలో అతడికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. సాధారణ హాజరు నుంచి మినహాయింపుతో పాటు చదువుకు అవసరమైన మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌కు అనుగుణంగా పరీక్షలు రాసే అవకాశాలపైనా కాలేజీ యాజమాన్యం ఆలోచించింది. అయితే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాల్సిన నిబంధన మాత్రం తప్పలేదు. అదే ధోనీకి పెద్ద సవాలుగా మారింది.


ఒక్క సెమ్ కూడా పాస్ అవ్వలేదు!

అంతర్జాతీయ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు, జట్టు బాధ్యతలతో ధోనీ అకాడమిక్ షెడ్యూల్‌ను సమన్వయం చేసుకోలేకపోయాడు. అతడికి పరీక్షలు రాయడం సులభతరం చేసేందుకు దేశంలోని ఇతర విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే అవకాశాన్ని కూడా కాలేజీ పరిశీలించింది. అయినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ధోనీ తన కోర్సులోని ఆరు సెమిస్టర్లలో ఒక్కదానిలోనూ ఉత్తీర్ణత సాధించలేదు. అంతేకాకుండా ఐదేళ్ల రిజిస్ట్రేషన్ గడువు కూడా ముగిసిపోయింది. అయితే చదువు పూర్తి చేయాలనుకుంటే తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని కాలేజీ తెలిపింది. కానీ ధోనీ ఆ కోర్సును పూర్తి చేసి డిగ్రీ పొందలేకపోయాడు. మరోవైపు క్రికెట్‌లో మాత్రం అతడి విజయ పరంపర కొనసాగింది. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించి చరిత్ర సృష్టించాడు.


ఇవి కూడా చదవండి:

అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్

ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ

Updated Date - Nov 17 , 2026 | 06:02 PM