అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే ధోనీ రిటైర్‌మెంట్.. అదేంటంటే?
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:10 PM
మహేంద్రసింగ్ ధోనీ.. మాట ఇస్తే తప్పడనే పేరున్న క్రికెటర్. అయితే ఇప్పుడు ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికే క్రమంలో చెన్నై అభిమానులకు ఇచ్చిన ఓ మాట మాత్రం నెరవేరకుండానే మిగిలిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్రసింగ్ ధోనీ.. మాట ఇస్తే తప్పడనే పేరున్న క్రికెటర్. భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆటలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. 2011లో సొంతగడ్డపై భారత్‌కు వన్డే ప్రపంచకప్ అందించి కోట్లాది మంది అభిమానుల కలను నెరవేర్చాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను తిరుగులేని జట్టుగా తీర్చిదిద్ది ఐదు టైటిళ్లు అందించాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్‌కు ఆటగాడిగా వీడ్కోలు పలికే క్రమంలో చెన్నై అభిమానులకు ఇచ్చిన ఓ మాట మాత్రం నెరవేరకుండానే మిగిలిపోయింది.
ధోనీకి చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. చెపాక్ మైదానంలోనే అతడు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా ఎదిగి చెన్నై అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 2021లో సీఎస్కే నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం ఓ కార్యక్రమంలో ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా చివరి వన్డే మ్యాచ్ రాంచీలో ఆడాను. సొంతగడ్డపై నా చివరి వన్డే కూడా నా స్వస్థలమైన రాంచీలోనే జరిగింది. అలాగే నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఆడాలని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాదా? ఐదేళ్ల తర్వాతనా? అనేది ఇప్పుడే చెప్పలేం’ అని అప్పట్లో ధోనీ వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ కోరిక నెరవేరకుండానే మిగిలిపోయింది. చెన్నై అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ధోనీ వీడ్కోలు మ్యాచ్‌కు అవకాశం లేకుండా పోయింది.
అహ్మదాబాద్‌లోనే చివరి ఐపీఎల్ మ్యాచ్..
ధోనీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను 2025 మే 25న అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు ఢిల్లీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేశాడు. అదే ఐపీఎల్‌లో అతడి చివరి బ్యాటింగ్ ప్రదర్శనగా నిలిచింది. దీంతో చెన్నైలో చివరి టీ20 మ్యాచ్ ఆడతానన్న ధోనీ మాట నెరవేరలేదు. ఆటగాడిగా మైదానంలోకి దిగకపోయినా.. సీఎస్కే జట్టుకు ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీలోకి భారత షూటర్ మను భాకర్
ఐపీఎల్ 2027: ఎల్ఎస్‌జీతో ట్రేడ్ డీల్.. రాజస్థాన్ రాయల్స్‌కు షమీ