డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటా.. ఐపీఎల్‌లో ఆడటంపై ధోని బిగ్ హింట్!
ABN , Publish Date - Oct 25 , 2026 | 08:04 AM
సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని.. తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంపై డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటానని సంకేతాలిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని.. తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంపై డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటానని సంకేతాలిచ్చాడు. దీంతో ఐపీఎల్ 2027లో మాహీ బరిలోకి దిగుతాడా? అన్న చర్చ మరోసారి మొదలైంది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి తన క్రికెట్ భవిష్యత్తుపై ప్రశ్న ఎదురైంది.
‘ఫిట్‌నెస్ పరంగా నేను కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు దానిపై తుది నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత డిసెంబర్‌లోపు నేను ఎంత ఫిట్‌గా ఉన్నానో చూసుకుని, మరో సీజన్ ఆడగలనా లేదా అనేది నిర్ణయించుకుంటా. నేను ఆడలేని పరిస్థితిలో ఉంటే.. ఈ పాతకాలపు వాహనం రోడ్డుపై సజావుగా నడిచేలా వైద్యులే అన్నీ సరిచేయాలి. మొత్తం ఒత్తిడి మీపైనే ఉంది’ అంటూ ధోని నవ్వులు పూయించాడు.
ధోనిపై సీఎస్కే ఆశలు!
ధోని వచ్చే సీజన్‌లో సీఎస్కే జెర్సీలో కనిపిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆశిస్తోంది. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం అతడికే వదిలేసింది. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ సైతం ధోనీ భవిష్యత్తుపై స్పందించారు. ‘ఈ ప్రశ్నను ధోనినే అడగాలి. చెన్నైకి వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని మాకు తెలియజేస్తాడు. అతడు సీఎస్కే తరఫున కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది. అతడు ఇప్పటికీ ఆటగాడే కదా!’ అని పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కాలి కండరాల సమస్యల కారణంగా ధోని జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో జట్టు పునర్నిర్మాణంపై ఫ్రాంచైజీ దృష్టి సారించింది.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు