మన కుర్రాళ్లు కొల్లగొట్టారు
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:20 AM
తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి చెలరేగడంతో.. తమ 300వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తిలక్ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 51 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్...
తిలక్, నితీశ్ అద్భుత పోరాటం
రెండో టీ20లో కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం
క్రైస్ట్‌చర్చ్: తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి చెలరేగడంతో.. తమ 300వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తిలక్ వర్మ (26 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 51 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకంతోపాటు నితీశ్‌కుమార్ (13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 26 నాటౌట్) అండగా నిలవడంతో.. శనివారం న్యూజిలాండ్‌తో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్లతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత కివీస్ 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. ఫిలిప్స్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకబ్స్ (46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 58) అర్ధ సెంచరీలు వృథా అయ్యాయి. అర్ష్‌దీప్ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 181/6 స్కోరు చేసి గెలిచింది. నమన్ ధిర్ (17 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్స్‌లతో 31), అభిషేక్ శర్మ (27) రాణించారు. శాంట్నర్ 4 వికెట్లు సాధించాడు. ఇషాన్ గాయపడడంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కింది. తిలక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఆదుకొన్న లోయరార్డర్: ఛేదనలో శాంట్నర్ దెబ్బకు మిడిలార్డర్ చేతులెత్తేయడంతో.. టీమిండియా 70/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, నమన్‌తో కలసి తిలక్ ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. మరోవైపు కివీస్ పేలవ ఫీల్డింగ్‌తోపాటు నాలుగు క్యాచ్‌లు వదిలేయడమూ భారత్‌కు కలిసొచ్చింది. తిలక్ ఆచితూచి ఆడినా, నమన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అయితే, 15వ ఓవర్‌లో నమన్‌ను శాంట్నర్ క్యాచ్ అవుట్ చేయడంతో.. భారత్‌కు ఓటమి తప్పదేమో అనిపించింది. ఈ దశలో తిలక్‌కు నితీశ్ అండగా నిలవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 30 బంతుల్లో 69 పరుగులతో జట్టుకు అనూహ్య విజయాన్ని అందించారు. చివరి 3 ఓవర్లలో విజయానికి 46 రన్స్ అవసరమవగా.. 18వ ఓవర్‌లో డఫీ బౌలింగ్‌లో నితీశ్ సిక్స్, తిలక్ రెండు బౌండ్రీలతో 17 రన్స్ రాబట్టారు. ఆ తర్వాతి ఓవర్‌లో 4,4,4,6తో చెలరేగిన తిలక్ 18 పరుగులు పిండుకొన్నాడు. దీంతో లక్ష్యం చివరి 6 బంతుల్లో 11 రన్స్‌కు దిగొ చ్చింది. డబుల్‌తో తిలక్ ఫిఫ్టీ పూర్తి చేయగా.. నితీశ్ మరో బంతి మిగిలుండగానే జట్టును గెలుపు గీత దాటించాడు. ఓపెనర్ శాంసన్ (14)ను డఫీ క్యాచవుట్ చేయగా.. వైభవ్ (4)ను స్మిత్ వెనక్కిపంపాడు. అభిషేక్, శ్రేయాస్ (7), అక్షర్ పటేల్ (11)ను శాంట్నర్ అవుట్ చేశాడు.
ఆరంభంలో తడబాటు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. పవర్‌ప్లేలో భారత బౌలర్ల దెబ్బకు తడబడింది. ఓపెనర్ సైఫర్ట్ (7)ను అర్ష్‌దీప్, మిచెల్ (6)ను భువీ అవుట్ చేశారు. మరో ఓపెనర్ అలెన్ (16)ను ప్రిన్స్ బౌల్డ్ చేయడంతో కివీస్ 41/3తో ఇబ్బందుల్లో పడింది. కానీ, ఫిలిప్స్, జాకబ్స్ నాలుగో వికెట్‌కు 116 రన్స్ జోడించడంతో జట్టు పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. ఫిలి్‌ప్సను అర్ష్‌దీప్ బోల్తా కొట్టించగా.. జాకబ్స్‌ను నితీశ్ వెనక్కిపంపాడు.
మైదానంలో తెలుగు పలుకులు
మ్యాచ్ మధ్యలో పరుగు తీసే క్రమంలో తిలక్, నితీశ్ తెలుగులో ముచ్చటించు కోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17వ ఓవర్‌లో ఫెర్గూసన్ బౌలింగ్‌లో తొలి బంతిని నితీశ్ థర్డ్‌మ్యాన్ వైపు ఆడాడు. తొలి రన్ వేగంగా పూర్తి చేసిన నితీశ్, రెండో రన్ కోసం పిచ్ మధ్యలోకి వచ్చాడు. కానీ, తిలక్ రాకపోవడంతో వెనక్కుమళ్లిన నితీశ్.. ఈ క్రమంలో కొద్దిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో నువ్వు కాల్ ఇవ్వలేదని తిలక్ అంటే.. నువ్వు వచ్చేసెయ్, నేను వచ్చేస్తా ఆరాంసే అంటూ నితీశ్ బదులిచ్చాడు. దీనికి తిలక్.. ‘రేయ్ రెండు అని చెప్పురా పోనీ, నేను ముందుకొచ్చి వెయిట్ చేస్తున్నా నీకోసం’ అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇలా.. అంతర్జాతీయ వేదికపై, అది కూడా విదేశీ గడ్డపై తెలుగులో మాట్లాడుకుంటూ వీరిద్దరూ చేసిన బ్యాటింగ్ నెట్టింట ఆసక్తికరంగా మారింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్: సైఫర్ట్ (సి) తిలక్ (బి) అర్ష్‌దీప్ 7, అలెన్ (బి) ప్రిన్స్ 16, డారిల్ మిచెల్ (సి) తిలక్ (బి) భువీ 6, ఫిలిప్స్ (సి) నమన్ (బి) అర్ష్‌దీప్ 70, జాకబ్స్ (సి) అక్షర్ (బి) నితీశ్ 58, శాంట్నర్ (నాటౌట్) 4, బ్రేస్‌వెల్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 180/5; వికెట్ల పతనం: 1-9, 2-18, 3-41, 4-157, 5-165; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-50-1, అర్ష్‌దీప్ 4-0-33-2, ప్రిన్స్ 4-0-30-1, నమన్ 1-0-7-0, అక్షర్ 4-0-28-0, నితీశ్ 3-0-31-1.
భారత్: శాంసన్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 14, అభిషేక్ (సి) స్మిత్ (బి) శాంట్నర్ 27, వైభవ్ (సి) మిచెల్ (బి) స్మిత్ 4, శ్రేయాస్ (బి) శాంట్నర్ 7, అక్షర్ (సి) మిచెల్ (బి) శాంట్నర్ 11, తిలక్ (నాటౌట్) 51, నమన్ (సి) ఫిలిప్స్ (బి) శాంట్నర్ 31, నితీశ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.5 ఓవర్లలో 181/6; వికెట్ల పతనం: 1-40, 2-44, 3-56, 4-69, 5-70, 6-112; బౌలింగ్: హెన్రీ 2-1-11-0, డఫీ 3.5-0-41-1, ఫెర్గూసన్ 3-0-37-0, బ్రేస్‌వెల్ 4-0-35-0, స్మిత్ 3-0-34-1, శాంట్నర్ 4-0-21-4.
1
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 38 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్. 2022లో భువనేశ్వర్ 37 వికెట్ల రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు.
1
టీ20 మ్యాచ్‌లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (అభేద్యంగా 69 రన్స్) నమోదు చేసిన భారత జోడీగా తిలక్, నితీశ్ నిలిచారు.
2
టీ20ల్లో 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరిన రెండో జట్టుగా భారత్. పాకిస్థాన్ (304) టాప్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు