ఎంఐపై ‘కంకషన్’ దుర్వినియోగం ఆరోపణలు.. హెడ్ కోచ్ రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:13 PM
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఓ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ ఓ వివాదంలో చిక్కుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ తల మెడకు గాయమై ఆడలేని సమయంలోనే కంకషన్ సబ్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనను పాటించకుండా ఎంఐ తమకు నచ్చినట్టు వ్యవహరించిందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
ఇదీ జరిగింది!
సీఎస్కే ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ను ఎంఐ పేసర్ బుమ్రా వేశాడు. సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బౌండరీ లైన్ వద్ద మిచెల్ శాంట్నర్ ఆ బంతిని అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ సమయంలో శాంట్నర్ భుజానికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్‌కు కూడా రాలేదు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఎంఐ తీసుకుంది. కానీ శార్దూల్ బ్యాటింగ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. 12 బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. శాంట్నర్‌కు కంకషన్ తీసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కంకషన్ రూల్‌ను ముంబై దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు రావడంపై హెడ్ కోచ్ మహేల జయవర్థనె మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించాడు.
‘క్యాచ్ పట్టేటప్పుడు శాంట్నర్ తల మొదట నేలను తాకింది. మెడ కూడా తగిలింది. తర్వాత భుజంపై ఒత్తిడి పడటంతో గాయమైంది. దీంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. స్కానింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తల తిరిగినట్లు అనిపించి ఇబ్బంది పడ్డాడు. దీంతో పడుకున్నాడు. అతడి భుజానికి ఐస్ కూడా పెట్టుకున్నాడు. శాంట్నర్ పరిస్థితి నిలకడగా లేదు. అందుకే మేం మ్యాచ్ రిఫరీని ‘కంకషన్’ కోసం విజ్ఞప్తి చేశాం. మ్యాచ్ రిఫరీ, అంపైర్లు తీసుకున్న నిర్ణయమది. అతడి స్థానంలో శార్దూల్‌ను తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. తాను బ్యాటింగ్ చేయలేకపోయినందుకు శాంట్నర్ చాలా బాధ పడ్డాడు. త్వరగా కోలుకుని వస్తాడని ఆశిస్తున్నాం’ అని జయవర్థనె వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!