Share News

శ్రేయస్‌ను వదులుకుని తప్పు చేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:54 PM

2024లో జట్టుకు ట్రోఫీని అందించిన అయ్యర్‌ను ఆ సీజన్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ తాజాగా స్పందించారు. అయ్యర్‌ను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.

శ్రేయస్‌ను వదులుకుని తప్పు చేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో అజేయంగా దూసుకెళ్తున్న కెప్టెన్. అతడి నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. ఆడిన అన్ని మ్యాచుల్లో గెలిచి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే 2024లో జట్టుకు ట్రోఫీని అందించిన అయ్యర్‌ను ఆ సీజన్ అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది ఐపీఎల్ చరిత్రలోనే ఆశ్చర్యపరిచిన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత జట్టుకు కప్పు అందించిన అయ్యర్‌ను రిటైన్ చేసుకోకపోవడంతో కేకేఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ విషయంపై కేకేఆర్ మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ తాజాగా స్పందించారు. అయ్యర్‌ను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందనే దానిపై మాట్లాడారు.


‘శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్లేయర్. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీని అందించాడు. కానీ కొన్ని పరిస్థితులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల అయ్యర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. మేం చేసింది చాలా పెద్ద తప్పే. కానీ అది ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదు. అయినా అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయడం బాధగా అనిపించింది. అయ్యర్ మాత్రమే కాదు.. ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలు జట్టుకు చాలా నష్టం తెచ్చిపెట్టాయి’ అని పండిట్ వెల్లడించారు.


భారత జట్టులోకి తిరిగొస్తాడు..

టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ స్థానం కోల్పోవడంపై కూడా పండిట్ స్పందించారు. ‘భారత జట్టులో ఆడటానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కూడా అవకాశాలు దొరక్కపోవచ్చు. అయితే ప్రస్తుతం అయ్యర్ ఫామ్ చూస్తే తిరిగి టీమ్‌లోకి రావడం ఖాయం అనిపిస్తోంది. అతడి ఆటలో పరిపక్వత కనిపిస్తోంది. పరిస్థితిని కాకుండా మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెడుతున్నాడు’ అని పండిట్ వెల్లడించారు. కెప్టెన్సీ పరంగానే కాకుండా ఒక ప్లేయర్‌గానూ అయ్యర్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 208 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా.. కేకేఆర్ ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయాన్నే నమోదు చేసింది. 3 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్

మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!

Updated Date - Apr 24 , 2026 | 04:10 PM