Share News

మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:41 AM

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి శతకంతో మెరిశాడు. ఫలితంగా ముంబైపై 103 పరుగులు భారీ తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ క్రమంలోనే శాంసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!
Sanju Samson

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న(గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి శతకంతో మెరిశాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ముంబై బౌల‌ర్లను త‌నదైన శైలిలో ఉతికారేశాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా ముంబైపై 103 పరుగులు భారీ తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ క్రమంలోనే శాంసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.


ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి చెన్నై బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఏ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ కూడా ముంబైపై సెంచరీ చేయలేదు. అదేవిధంగా సీఎస్కే తరఫున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరఫున అత్యధిక సెంచరీలు (2) చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు చేరాడు. అతడు కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్, మురళీ విజయ్, సురేశ్ రైనా, షేన్ వాట్సన్.. తలో రెండు సెంచరీలు చేశారు.


అలానే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్‌ నిలిచాడు. వీరిద్దరూ చెరో ఐదు సెంచరీలు చేశారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెట్‌లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు. 7 సెంచరీలతో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

శాంసన్‌.. దంచెన్‌!

స్టార్క్‌ వస్తున్నాడు..

Updated Date - Apr 24 , 2026 | 11:13 AM