Share News

శాంసన్‌.. దంచెన్‌!

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:44 AM

ఆల్‌రౌండ్‌షోతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వాంఖడేలో కదం తొక్కింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 నాటౌట్‌) మరోసారి విలువైన ఆటతీరును ప్రదర్శించాడు...

శాంసన్‌.. దంచెన్‌!

నేటి మ్యాచ్‌

బెంగళూరు X గుజరాత్‌

వేదిక బెంగళూరు రా.7.30 నుంచి

శతకంతో చెలరేగిన సంజూ

103 రన్స్‌ తేడాతో చెన్నై ఘనవిజయం

స్పిన్నర్‌ అకీల్‌కు నాలుగు వికెట్లు

ముంబై: ఆల్‌రౌండ్‌షోతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వాంఖడేలో కదం తొక్కింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 నాటౌట్‌) మరోసారి విలువైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ సీజన్‌లో రెండో శతకంతో అదుర్స్‌ అనిపించగా.. మరోవైపు బలహీనంగా భావిస్తున్న చెన్నై బౌలింగ్‌ దళం ప్రత్యర్థిని బెదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్లు అకీల్‌ హోసేన్‌ (4/17), నూర్‌ అహ్మద్‌ (2/24)ల ధాటికి ముంబై ఇండియన్స్‌ చిగురుటాకులా వణికింది. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 103 పరుగుల తేడాతో భారీవిజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. రుతురాజ్‌ (22) ఓ మాదిరిగా ఆడాడు. స్పిన్నర్‌ ఘజన్‌ఫర్‌, పేసర్‌ అశ్వనిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19 ఓవర్లలో అతికష్టంగా 104 పరుగులే చేయగలిగింది. వీరి ఇన్నింగ్స్‌లో తిలక్‌ (37), సూర్యకుమార్‌ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించడం గమనార్హం. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు.

స్పిన్నర్లు తిప్పేశారు..: సొంత మైదానం.. పైగా మంచు ప్రభావం కూడా ఉండడంతో ముంబై బ్యాటర్లు మ్యాచ్‌ను విజయంతో ముగిస్తారని భావించారు. కానీ చెన్నై బౌలర్లు అనూహ్యంగా పట్టు సాధించారు. స్పిన్నర్లు అకీల్‌, నూర్‌ ద్వయం ఆరు వికెట్లతో చెలరేగింది. దీంతో అటు పరుగులు చేయలేక, ఇటు వికెట్లు కాపాడుకోలేక.. సొంత మైదానంలోనే ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలి ఓవర్‌ నుంచే ముంబై తడబడింది. ఓపెనర్‌ డానిష్‌, నమన్‌లను స్పిన్నర్‌ అకీల్‌ డకౌట్లుగా పంపగా.. మరో ఓపెనర్‌ డికాక్‌ (7)ను పేసర్‌ ముకేశ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ముంబై 11/3 స్కోరుతో షాక్‌కు గురైంది. సూర్యకుమార్‌, తిలక్‌ ఉన్నా భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో 29/3 స్కోరుతో పవర్‌ప్లేలోనే ఓటమి కళ్ల ముందు కనిపించింది. కుదురుకున్న తిలక్‌ బ్యాట్‌ ఝుళిపించే సమయానికి మరోసారి స్పిన్నర్‌ అకీల్‌ కీలక పాత్ర పోషించాడు. 12వ ఓవర్‌లో తిలక్‌ను బౌల్డ్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ వెంటనే హార్దిక్‌ (1), రూథర్‌ఫోర్డ్‌ (0)లను వరుస బంతుల్లో నూర్‌ అవుట్‌ చేయడంతో ముంబైకి ఘోర ఓటమి ఖరారైంది.


శాంసన్‌ అంతా తానై..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ శాంసన్‌ ఆటే హైలైట్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు వేగంగా ఆడే క్రమంలో వికెట్లను కాపాడుకోలేకపోయారు. ఏ ఒక్కరూ కనీసం 20 బంతులైనా ఎదుర్కోలేకపోయారు. అయినా శాంసన్‌ పట్టు వీడకుండా చివరి వరకు నిలిచి శతకంతో మురిపించాడు. మరో ఓపెన్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ రెండో ఓవర్‌లో 4,4,6తో 19 రన్స్‌ అందించాడు. ఇక కుదురుకున్నట్టే అనుకున్న వేళ స్పిన్నర్‌ ఘజన్‌ఫర్‌కు చిక్కాడు. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో అతడు 104 పరుగులే చేయడం గమనార్హం. అటు శాంసన్‌ మాత్రం హార్దిక్‌ ఓవర్‌లో 4,6,4,4తో 19 రన్స్‌తో జోరు చాటాడు. ఉన్న కాసేపు సర్ఫరాజ్‌ (14) ఫోర్లతో ఆకట్టుకున్నా స్పిన్నర్‌ శాంట్నర్‌ అతడిని బౌల్డ్‌ చేశాడు. రెండో వికెట్‌కు శాంసన్‌-సర్ఫరాజ్‌ మధ్య 16 బంతుల్లోనే 40 పరుగులు సమకూరాయి. దీంతో పవర్‌ప్లేలో జట్టు 73/3 స్కోరుతో నిలిచింది. స్పిన్నర్లపై ఎదురుదాడి కోసం ముందే బరిలోకి దిగిన దూబే (5) ఎలాంటి ప్రభావమూచూపలేదు. ఇక బ్రెవిస్‌ మాత్రం శాంట్నర్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లతో వేగం చూపాడు. అటు శాంసన్‌ ఓ ఫోర్‌తో 26 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే 11వ ఓవర్‌లో బ్రెవి్‌సను పేసర్‌ అశ్వని పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత కార్తీక్‌ (18) కాసేపు శాంసన్‌కు అండగా నిలిచాడు. శాంట్నర్‌ ఓవర్‌లో కార్తీక్‌ రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అటు క్రిష్‌ భగత్‌ ఓవర్‌లో శాంసన్‌ చెలరేగి 6,4,4తో 15 రన్స్‌ రాబట్టగా చెన్నై స్కోరు 16 ఓవర్లలో 150కి చేరింది. ఆ తర్వాత కార్తీక్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఒవర్టన్‌ (15)ను అశ్వని దెబ్బతీయగా.. 19వ ఓవర్‌లో బుమ్రా పది పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో శాంసన్‌ మూడు సిక్సర్లతో చెలరేగి తన శతకంతో పాటు జట్టు స్కోరును కూడా 200 దాటించాడు.


స్కోరుబోర్డు

చెన్నై: శాంసన్‌ (నాటౌట్‌) 101, రుతురాజ్‌ (సి) తిలక్‌ (బి) ఘజన్‌ఫర్‌ 22, సర్ఫరాజ్‌ (బి) శాంట్నర్‌ 14, దూబే (బి) ఘజన్‌ఫర్‌ 5, బ్రెవిస్‌ (సి) బుమ్రా (బి) అశ్వని 21, కార్తీక్‌ (సి) శాంట్నర్‌ (బి) బుమ్రా 18, ఒవర్టన్‌ (సి) నమన్‌ (బి) అశ్వని 15, అకీల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 207/6. వికెట్ల పతనం: 1-32, 2-72, 3-91, 4-122, 5-165, 6-181. బౌలింగ్‌: బుమ్రా 4-0-31-1, హార్దిక్‌ పాండ్యా 2-0-38- 0, ఘజన్‌ఫర్‌ 4-0-25-2, మిచెల్‌ శాంట్నర్‌ 4-0-44-1, అశ్వని కుమార్‌ 4-0-37-2, క్రిష్‌ భగత్‌ 2-0-31-0.

ముంబై: డికాక్‌ (బి) ముకేశ్‌ 7, డానిష్‌ (సి) శాంసన్‌ (బి) అకీల్‌ 0, నమన్‌ (బి) అకీల్‌ 0, సూర్యకుమార్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) అకీల్‌ 36, తిలక్‌ (బి) అకీల్‌ 37, హార్దిక్‌ (సి) ముకేశ్‌ (బి) నూర్‌ 1, రూథర్‌ఫోర్డ్‌ (సి) అన్షుల్‌ (బి) నూర్‌ 0, శార్దూల్‌ (సి) బ్రెవిస్‌ (బి) అన్షుల్‌ 6, క్రిష్‌ (సి) గుర్జప్‌నీత్‌ (బి) ఒవర్టన్‌ 7, అశ్వని (నాటౌ ట్‌) 1, బుమ్రా (సి) శాంసన్‌ (బి) గుర్జ్‌పనీత్‌ 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం : 19 ఓవర్లలో 104 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-7, 2-7, 3-11, 4-84, 5-85, 6-85, 7-87, 8-100, 9-100, 10-104; బౌలింగ్‌: అకీల్‌ హోసేన్‌ 4-1-17-4, ముకేశ్‌ 4-0-31-1, అన్షుల్‌ 3-0-10-1, నూర్‌ అహ్మద్‌ 4-0-24-2, ఒవర్టన్‌ 2-0-14-1, గుర్జ్‌పనీత్‌ 2-0-7-1.

1

సీ ఎస్ కే చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కాగా.. అటు ముంబై ఇండియన్స్‌కు కూడా ఇదే అత్యంత చెత్త ఓటమి. అలాగే ఒకే సీజన్‌లో ముంబై జట్టు వాంఖడేలో హ్యాట్రిక్‌ ఓటములు పొందడం ఇదే తొలిసారి.

4

ఐపీఎల్‌లో ఎక్కువ సెంచరీలు (5) చేసిన నాలుగో బ్యాటర్‌గా శాంసన్‌. ఇక ఓవరాల్‌ గా టీ20 ఫార్మాట్‌లో చూస్తే...భారత క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అభిషేక్‌ (9) ముందుండగా, రోహిత్‌తో కలిసి సంజూ (8) రెండో స్థానంలో ఉన్నాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 6 5 0 1 11 1.420

రాజస్థాన్‌ 7 5 2 0 10 0.790

బెంగళూరు 6 4 2 0 8 1.171

హైదరాబాద్‌ 7 4 3 0 8 0.820

చెన్నై 7 3 4 0 6 0.118

ఢిల్లీ 6 3 3 0 6 -0.130

గుజరాత్‌ 6 3 3 0 6 -0.821

ముంబై 7 2 5 0 4 -0.736

లఖ్‌నవూ 7 2 5 0 4 -1.277

కోల్‌కతా 7 1 5 1 3 -0.879

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం

Updated Date - Apr 24 , 2026 | 01:44 AM