సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:39 AM
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నిన్న(గురువారం) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. సీఎస్కే జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.... ‘ఏ మ్యాచ్‌లో అయినా పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత కోలుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఛేదనలో ఇలా జరగడం బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతుంది. మా ఇన్నింగ్స్‌లో కూడా అదే జరిగింది. అయితే నేను పిచ్‌ను సాకుగా చూపి తప్పించుకునే రకాన్ని కాదు. సీఎస్కే ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మేమే మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా స్పిన్నర్లు మంచి బౌలింగ్ చేశారని భావిస్తున్నాను' అని వెల్లడించాడు.
'చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో వాళ్ల బ్యాటర్లంతా సమష్ఠిగా రాణించి.. స్కోర్‌ను 200 దాటించారు. పవర్ ప్లేలో మేము కూడా అదే తరహాలో రాణించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో. జట్టులో మార్పు గురించి ప్రస్తుతం చెప్పలేను. టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం’ అని పాండ్య తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన సీఎస్కే.. సంజూ విధ్వంసం కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. సీఎస్‌కే బౌలర్ల విజృంభణ కారణంగా 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా పరుగుల తేడా పరంగా ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి:
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!