కీలక టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్
ABN , Publish Date - Apr 23 , 2026 | 08:03 PM
పాకిస్థాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మహిళల ఛాంపియన్‌షిప్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్‌షిప్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి కూడా పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.
పాకిస్థాన్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుంచి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏ లో నేపాల్, శ్రీలంక, భూటాన్, గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి.
భారత్‌లో జరిగిన టీ20 క్రికెట్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్.. ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొననుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. అయితే సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ టోర్నీలో భారత్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది. భారత్ కూడా ఇటీవల పాక్ వేదికగా జరిగే క్రీడా ఈవెంట్లను బాయ్‌కాట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం