కెప్టెన్ బాధ్యత తీసుకోవాలి.. ఒత్తిడి నుంచి తప్పించుకోవద్దు: అశ్విన్
ABN , Publish Date - Apr 24 , 2026 | 02:33 PM
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 208 పరుగులు లక్ష్య ఛేదనలో ఎంఐ 104 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ వ్యూహాత్మక తప్పిదాలపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘోరంగా పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 208 పరుగులు లక్ష్య ఛేదనలో ఎంఐ 104 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస పరాజయాలు తప్పడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అతడి వ్యూహాత్మక తప్పిదాలపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
‘సొంతగడ్డపై ఓడిపోవడం నిజంగా విచారకరం. వాంఖడే స్టేడియంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాండ్య.. ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఇదే మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై అదే తప్పు చేసి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. అయినా చేసిన తప్పుల నుంచి హార్దిక్ ఏమీ నేర్చుకోవడం లేదు. అవే తప్పులు రిపీట్ చేస్తున్నాడు. ఆర్సీబీతో ఓటమి తర్వాత కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జట్టుకు నష్టంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో వాంఖడే పిచ్ స్లో అవుతుందని తెలిసినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోకపోవడం హార్దిక్ చేసిన పెద్ద తప్పు. సీఎస్కే టాస్ ఓడి 208 పరుగుల స్కోర్ చేసింది. కానీ ఎంఐ 104 పరుగులకే ఆలౌట్ అవ్వడం అత్యంత దారుణం’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
బాధ్యతగా లేడు..
హార్దిక్ పాండ్య డెత్ ఓవర్లలో తీసుకున్న నిర్ణయాలపై కూడా అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘చివరి ఓవర్‌ను అనుభవం లేని కృష్ణ భగత్‌కు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన హార్దిక్ పాండ్య.. తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సింది. కీలక సమయాల్లో కెప్టెన్ బాధ్యత తీసుకోవాలి. ఒత్తిడిని నుంచి తప్పించుకోవద్దు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం, అభిమానుల నుంచి వస్తోన్న విమర్శల వల్ల ఒక ప్లేయర్‌పై మానసిక ఒత్తిడి పడుతుంది. కానీ గతంలో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన ఘనత పాండ్యది. హార్దిక్ తిరిగి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది’ అని అశ్విన్ స్పష్టం చేశాడు. కాగా ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు ఓడిన ఎంఐ.. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!