ఫిఫా ఫైనల్.. ఆ నాలుగు టికెట్ల ధర ఒక్కోటి రూ.21 కోట్లు
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:11 PM
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగు ప్రత్యేక సీట్ల టికెట్లను ఫిఫా రీసేల్ సైట్ సేల్‌కు పెట్టింది. ఆ టికెట్ల ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లు).
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే దీని టికెట్ల కోసం ఇప్పటికే 50 కోట్లకు పైగా అభ్యర్థనలు వచ్చాయని ఫిఫా తెలిపింది. తాజాగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగు ప్రత్యేక సీట్ల టికెట్లను ఫిఫా రీసేల్ సైట్ సేల్‌కు పెట్టింది. ఆ టికెట్ల ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు (రూ.21 కోట్లు). దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క టికెట్‌కు అంత ధర ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జులై 19న న్యూజెర్సీ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ ప్రత్యేక సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. గోల్ వెనక భాగంలో ఉన్న లోయర్ డెక్‌లోని బ్లాక్-124, లైన్-45లో సీట్ నంబర్లు 33 నుంచి 36 వరకు ఉన్నాయి. మరిన్ని ఇతర సీట్ల ధరలను కూడా ఫిఫా వెల్లడించింది. మరో ఐల్ సీట్ ధర 2 లక్షల డాలర్లకు పైగా ఉండగా, అప్పర్ డెక్‌లోని సీట్లు కూడా లక్షల డాలర్ల రేంజ్‌లోనే ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అదే సెక్షన్‌లో పక్కనే ఉన్న మరో సీట్ మాత్రం కేవలం 23 వేల డాలర్లకు లభించడం గమనార్హం. ఈ ప్రపంచ కప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్రీడాభివృద్ధికి తన 211 సభ్య దేశాలలో తిరిగి పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఫిఫా తెలిపింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లు జూన్ 11 నుంచి జులై 19 వరకు 39 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈ సారి మాత్రం 48 దేశాలు పోటీకి దిగనున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీ ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా కానుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాప్ కేటగిరీ టికెట్లను ఫిఫా ఇటీవల భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో టికెట్ ధరను 10,990 డాలర్లు (రూ.10.19 లక్షలు)గా నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!