వైభవ్ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ
ABN , Publish Date - May 03 , 2026 | 04:13 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ అన్‌ప్రొఫెషనల్ క్రికెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేశ్ తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైభవ్ అన్‌ప్రొఫెనషనల్ క్రికెటర్ అంటూ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏబీ డివిలియర్స్ చేసిన ఓ ఇంటర్వ్యూలో జితేశ్.. ‘వైభవ్‌కు అస్సలు ప్రొఫెషనలిజం లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేశ్ తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు. మైదానంలో వైభవ్ ప్రొఫెషనల్‌గానే ఉంటాడని, ఆట పూర్తయ్యాక అతడు చిన్నపిల్లాడేనంటూ వెల్లడించాడు.
‘వైభవ్ సూర్యవంశీ నాకు మంచి స్నేహితుడు. అతడితో నాకు దగ్గర సంబంధం ఉంది. అందుకే సరదాగా వైభవ్‌ను ఏదైనా అనగలను. అతడు ఆడే విధానం, టెక్నిక్, మెంటాలిటీ, కష్టపడే తత్వం.. ఇవన్నీ చూస్తుంటే వైభవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో రాణించగలడు అనిపిస్తుంది. మైదానంలో అతడు చాలా ప్రొఫెనషనల్‌గా కనిపిస్తాడు. అయితే ఆట పూర్తయ్యాక మాత్రం వైభవ్ 15 ఏళ్ల కుర్రాడే. అతడికి ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. మా గదికి వచ్చి ఐస్‌క్రీం తింటాడు. నా భార్యతో మాట్లాడతాడు. యూట్యూబ్‌లో సరదాగా వీడియోలు చూస్తాడు. మాతోనే కాదు బయట కూడా చిన్నపిల్లాడిలానే ఉంటాడు. అందుకే నేను వైభవ్‌ను అన్‌ప్రొఫెనషల్ అన్నాను. అది నేను సరదాగా అన్న మాట. వైభవ్‌తో నాకు అలాంటి చనువు ఉంది కాబట్టే అన్నాను. అది ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదు. సోషల్ మీడియాలో ఎవరు ఏం అనుకున్నా నాకు సంబంధం లేదు. వైభవ్ ఇంకా 15 ఏళ్ల పిల్లాడే. ఈ వయసులో పిల్లలు అలాగే ఉండాలి. క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలి.. మిగతా విషయాల్లో తమకు నచ్చినట్టు ఉండాలి’ అని జితేశ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు
ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్