Share News

ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 03 , 2026 | 11:56 AM

నిన్న చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఘోర పరాజయంలోనూ ముంబై ఇండియ‌న్స్ ఓ భారీ రికార్డును న‌మోదు చేసింది.

ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు
Mumbai Indians 50000 runs

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ప‌రాజ‌యాల‌తో ప్లేఆఫ్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. నిన్న(శ‌నివారం) చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఘోర పరాజయంలోనూ ముంబై ఇండియ‌న్స్ ఓ భారీ రికార్డును న‌మోదు చేసింది.


టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చ‌రిత్ర సృష్టించింది. చెన్నైతో మ్యాచ్‌కు ముందు 50వేల ప‌రుగుల మైలురాయిని అందుకోవ‌డానికి ముంబై ఇండియ‌న్స్‌కు 114 ప‌రుగులు కావాల్సి ఉంది. అయితే ముంబై ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.ఇప్పటి వరకు ముంబై జట్టు 286 ఐపీఎల్ మ్యాచ్‌లు, 22 ఛాంపియన్స్ లీగ్‌ మ్యాచులు ఆడింది.


ఇక‌ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్‌ (48,244 పరుగులు), ఆర్సీబీ (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్(46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. నిన్నటి మ్యాచ్ ద్వారా ప్రపంచ రికార్డు సాధించిన‌ప్పటికీ మ్యాచ్ ఫ‌లితం మాత్రం ముంబై జట్టుకు చేదు అనుభ‌వం మిగిల్చింది. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) ఉన్నారు.


మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 18.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 160 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), కార్తిక్ శ‌ర్మ (54 నాటౌట్‌) సీఎస్‌కేను గెలిపించారు. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్

ఎస్ఆర్‌హెచ్ vs కేకేఆర్.. ఉప్పల్‌లో గెలుపెవరిది..

Updated Date - May 03 , 2026 | 12:54 PM