Share News

ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ

ABN , Publish Date - May 03 , 2026 | 02:55 PM

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చేసిన గన్ షాట్ సెలబ్రేషన్స్ గురించి మ్యాచ్ అనంతరం కార్తిక్ వివరించాడు.

ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ
Karthik Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అర్ధ శతకం పూర్తి అయ్యాక ‘గన్ షాట్’ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఇంతకుముందు ఎంఎస్ ధోని టీమిండియా తరఫున తన కెరీర్ తొలినాళ్లలో ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాక ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడు కార్తిక్ శర్మ ధోని ఫార్ములాను రీక్రియేట్ చేశాడు. అయితే అలా చేయడానికి గల కారణాలను కార్తిక్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.


‘నేనేమీ ప్రత్యేకంగా ఆడలేదు. చివరి వరకూ క్రీజులో ఉండాలనే లక్ష్యంతోనే ఆడాను. మ్యాచ్‌ను ఫినిష్ చేసి జట్టును గెలిపించడమే నా పని. రుతురాజ్ కూడా ఇదే మాట చెప్పాడు. స్వేచ్ఛగా ఆడమని సలహా ఇచ్చాడు. అంతకంటే ఏమీ చెప్పలేదు. క్రీజులోకి వెళ్లిన తర్వాత ప్లాన్ ప్రకారం ఆడా. జట్టు విజయంలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా అనిపించింది. పిచ్ చాలా మందకొండిగా ఉంది. స్పిన్నర్లకు గ్రిప్ దొరికింది. పరిస్థితులను అలవర్చుకుని ఆడేందుకు ప్రయత్నించా. నేను కొట్టిన ప్రతి బౌండరీ నాకు ఫేవరెట్. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్‌షాట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఇది ఐపీఎల్ కెరీర్‌లోనే తొలి హాఫ్ సెంచరీ. ఇందులో ఎలాంటి సందేశం లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మా కుటుంబ సభ్యులెవరూ చూడలేదు. ఇంట్లోనే టీవీలో వీక్షించారు’ అని కార్తిక్ శర్మ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు

ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్

Updated Date - May 03 , 2026 | 03:08 PM