Share News

మా వెన్నంటే ఉన్న అభిమానుల కోసం ఏదైనా చేస్తాం: రుతురాజ్

ABN , Publish Date - May 03 , 2026 | 12:44 PM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చెపాక్‌ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ... ఎల్లో జెర్సీ కోసం, అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడించాడు.

మా వెన్నంటే ఉన్న అభిమానుల కోసం ఏదైనా చేస్తాం: రుతురాజ్
Ruturaj Gaikwad interview

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శనివారం) చెపాక్‌ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో వరుసగా ముంబైపై రెండో విజయం సాధించడంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు కార్తిక్ శర్మ కీలక పాత్ర పోషించారు. ఎల్లో జెర్సీ కోసం, అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు.


మ్యాచ్ అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ..'బౌలింగ్ సమయంలో మొదటి రెండు ఓవర్లను చాలా చక్కగా ఆరంభించాం. ఆ తర్వాత పరిస్థితి కాస్త చేజారినట్లు అనిపించింది. కానీ, పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ టార్గెట్‌ను ఛేదించవచ్చని, అలా జరగాలంటే టాప్‌ 3లో ఎవరో ఒకరు చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాము. కాంబోజ్‌తో పాటు ఇతర బౌలర్లు చాలా చక్కగా రాణించారు. ఈ మ్యాచ్‌లో అకీల్ హుసేన్‌కు అవకాశం కల్పించలేకపోయాం. జట్టు కూర్పులో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని రుతురాజ్ తెలిపాడు.


'ప్రస్తుతం నేను మంచి రిథమ్‌లోనే ఉన్నా. అందుకు నా భార్య, నా సహచరులు, నా మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. నేనూ మ్యాచ్‌ను ఫినిష్ చేయగలనని తెలుసు. ఈసారి నిరూపించుకున్నాను. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లు రాణిస్తుండటం మాకు పెద్ద సానుకూలాంశం. ఈ జాబితాలో కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్.. ఇలాంటి ప్లేయర్లు కచ్చితంగా ఉంటారు. రాబోయే మ్యాచుల విషయంలో మాది ఒకటే సూత్రం. తప్పులు జరిగినా.. వాటిని వెంటనే సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. ఎల్లో జెర్సీ కోసం, నిరంతరం మా మద్దతు ఇచ్చే అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని రుతురాజ్‌ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు

ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్

Updated Date - May 03 , 2026 | 01:05 PM