బాలుడిపై బంధువు దారుణం.. మందులో మిక్సింగ్ కోసం నీళ్లు తేలేదని..
ABN , Publish Date - May 03 , 2026 | 12:31 PM
మందులో కలుపుకోవడానికి నీళ్లు తేలేదన్న కోపంతో 9 ఏళ్ల బాలుడిని బలితీసుకున్నాడు ఓ వ్యక్తి. ఇంట్లో శుభకార్యం జరుగుతున్న సమయంలో పిల్లాడిని తుపాకితో కాల్చి చంపేశాడు.
లక్నో, మే 3: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మందులో కలుపుకోవడానికి నీళ్లు తేలేదన్న కోపంతో 9 ఏళ్ల బాలుడిని బలితీసుకున్నాడు ఓ వ్యక్తి. ఇంట్లో శుభకార్యం జరుగుతున్న సమయంలో పిల్లాడిని తుపాకితో కాల్చి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కాస్‌గంజ్ జిల్లాలోని యాకుత్‌గంజ్ గ్రామానికి చెందిన 9 ఏళ్ల యశ్‌పాల్ అలియాస్ యశ్ ఇంట్లో శుక్రవారం నామకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల్లోని బంధువులు చాలా మంది వచ్చారు. యశ్ తండ్రి జశ్వీర్ గోలా బంధువు దినేశ్ యాదవ్ కూడా కార్యక్రమానికి వచ్చాడు.
ఇంటికి కొద్దిదూరంలో మందు తాగుతున్న దినేశ్.. యశ్‌ను పిలిచాడు. మందులో కలపడానికి నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. ఇందుకు యశ్ ఒప్పుకోలేదు. మద్యం మత్తులో ఉన్న దినేశ్ దీన్ని తట్టుకోలేకపోయాడు. తన దగ్గర ఉన్న తుపాకితో యశ్ కడుపులో కాల్చాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డ బాలుడిని కాస్‌గంజ్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి అలీఘర్‌కు తీసుకెళ్లారు. బాలుడు అలీఘర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తట్టె ఇడ్లీ.. తయారు చేసుకోండిలా...
కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. బంగారు ఆభరణాల దోపిడీ