Share News

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:28 AM

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను రవీంద్ర జడేజా నడిపించడం ఖాయమైంది. ‘ఎక్స్‌’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. గత సీజన్‌ వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!
Ravindra Jadeja

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌–2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సంజూ శాంసన్ తర్వాత ఎవరు నాయకత్వ బాధ్యతలు చేపడతారన్న దానిపై అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. యశస్వి జైస్వాల్‌, రియాన్ పరాగ్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) పేరు తెరపైకి వచ్చింది.


చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)తో ట్రేడ్‌ డీల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌కు వచ్చిన జడేజాను కెప్టెన్‌గా నియమించే అవకాశముందన్న సంకేతాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు ఫ్రాంచైజీ(RR) చేసిన ఓ పోస్టు అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. దాదాపు జడేజాకే కెప్టెన్సీ ఖాయమైనట్లు తెలుస్తోంది. ‘ఎక్స్‌’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. 2008-2009 ఐపీఎల్ సీజన్లలో రాజస్థాన్‌కు ఆడిన జడేజా.. ఇప్పుడు మళ్లీ అదే జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.


పుణెకు రాజస్థాన్ హోం మ్యాచ్‌లు?

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌–2026లో రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన కొన్ని హోం మ్యాచ్‌లను పుణెలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియాన్ని హోం వేదికగా ఉపయోగించేందుకు రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టేడియం, పరిసర సదుపాయాలపై పరిశీలన పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి.


జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం స్థానంలో పుణెను ఎంచుకునే దిశగా ఫ్రాంచైజీ అడుగులు వేస్తోంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌తో కొనసాగుతున్న విభేదాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐపీఎల్‌–2025లో ఓ ఆర్‌సీఏ అధికారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఆర్‌సీఏ అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉండటంతో పరిస్థితి సర్దుబాటు కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పుణె వేదికపై బీసీసీఐ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 08:26 AM