Share News

Bangladesh Cricket: భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడబోం

ABN , Publish Date - Jan 05 , 2026 | 06:17 AM

ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ విడుదల వ్యవహారం మరింతగా ముదురుతోంది. బీసీసీఐకి దీటుగా సమాధానమిచ్చే క్రమంలో.. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ఆడబోమని...

Bangladesh Cricket: భారత్‌లో వరల్డ్‌కప్‌ ఆడబోం

  • మా జట్టు వేదికలను మార్చండి

  • ఐసీసీకి బంగ్లాదేశ్‌ విజ్ఞప్తి

ఢాకా: ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ విడుదల వ్యవహారం మరింతగా ముదురుతోంది. బీసీసీఐకి దీటుగా సమాధానమిచ్చే క్రమంలో.. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో ఆడబోమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తేల్చి చెప్పింది. ఈమేరకు అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తమ జట్టు ఆడే వేదికలు మార్చాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి సైతం చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ జట్టు తమ గ్రూప్‌ మ్యాచ్‌ల్లో మూడింటిని కోల్‌కతాలో, ఒకటి ముంబైలో ఆడాల్సి ఉంది. భద్రతా కారణాలరీత్యానే తామీ నిర్ణయం తీసుకున్నట్టు బీసీబీ పేర్కొంది. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తమ జట్టు ఆటగాళ్లకు భారత్‌లో తగిన భద్రత లభించదనే సందేహం నెలకొంది. అందుకే బంగ్లా ప్రభుత్వ సూచనల మేరకు టీ20 వరల్డ్‌కప్‌ కోసం మా జట్టు భారత్‌లో పర్యటించదు’ అని బీసీబీ తేల్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై సాగుతున్న నిరంతర దాడులపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో ఐపీఎల్‌లో ఏకైక బంగ్లా ప్లేయర్‌ ముస్తాఫిజుర్‌ను వెంటనే తొలగించాలంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అభిమానులు ఒత్తిడి తెచ్చారు. అటు బీసీసీఐ కూడా అతడిని విడుదల చేయాలని ప్రకటించడంతో ఇరు దేశ క్రికెట్‌ సంబంధాలు మరింత సున్నితంగా మారాయి. కాగా ఐపీఎల్‌లో ఆడేందుకు ముస్తాఫిజుర్‌కు ఇచ్చిన ఎన్‌ఓసీని బంగ్లా క్రికెట్‌ బోర్డు వెనక్కి తీసుకుంది.


లిట్టన్‌ దాస్‌

నాయకత్వంలో..

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొనే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టును ప్రకటించారు. వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంకలో జరిగే ఈ మెగా టోర్నీలో టాపార్డర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ కుమార్‌ దాస్‌ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగనుంది. అలాగే 15 మందితో కూడిన ఈ జాబితాలో ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీ్‌సకు దూరమైన పేసర్‌ టస్కిన్‌ అహ్మద్‌ను ఎంపిక చేశారు. అయితే వికెట్‌ కీపర్‌ జకెర్‌ అలీ, మహీదుల్‌ ఇస్లాం అన్‌కోన్‌, నజ్ముల్‌ షంటో చోటు కోల్పోయారు.

మార్చడం అంత సులువు కాదు..!

భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ ఆడేది లేదని తేల్చి చెప్పిన బంగ్లాదేశ్‌ జట్టు ప్రత్యామ్నాయంగా శ్రీలంకలో బరిలోకి దిగాలనుకుంటోంది. కానీ టోర్నీకి మరో నెల మాత్రమే సమయం ఉన్నందున ఈ వేదికల మార్పు అంత సులువు కాదని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఒకరి ఇష్టానికి అనుగుణంగా మ్యాచ్‌ల వేదికలను మార్చలేం. ఎందుకంటే ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రత్యర్థి జట్ల గురించి కూడా ఆలోచించండి. వారి విమాన టిక్కెట్లతో పాటు హోటళ్లన్నీ బుక్‌ అయ్యాయి. లీగ్‌ దశలో ప్రతీ రోజు మూడు మ్యాచ్‌లుంటాయి. ఇందులో ఓ మ్యాచ్‌ శ్రీలంకలోనే జరుగుతుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ సిబ్బంది కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అనుకున్నంత సులభమైతే కాదు’ అని బోర్డు అధికారి తేల్చాడు.

‘ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధించాలి’

ఢాకా: తమ స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించడంతో రగిలిపోతున్న బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మరో కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. తమ దేశంలో ఈ లీగ్‌ ప్రసారాలను నిషేధించాలనుకుంటోంది. ఈమేరకు దేశ సమాచార, ప్రసారశాఖకు విజ్ఞప్తి చేసినట్టు ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ వెల్లడించాడు. బంగ్లా క్రికెట్‌కు అవమానం జరిగితే ఇక ఎంతమాత్రం సహించబోమని, బానిసత్వ రోజులు ముగిసినట్టుగా ఆసిఫ్‌ హెచ్చరించాడు.

ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 06:17 AM