ఐపీఎల్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం!
ABN , Publish Date - May 31 , 2026 | 02:56 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మ్యాచ్ రద్దయితే..?
ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంటుంది. ఆదివారం వర్షం కారణంగా కనీస ఓవర్ల ఆట కూడా సాధ్యంకాక మ్యాచ్ రద్దయితే సోమవారం ఫైనల్ నిర్వహిస్తారు. అయితే సోమవారం వర్షం పడే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీని ఐపీఎల్ 2026 విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఆదివారమే మ్యాచ్ నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మైదానం కవర్లతో కప్పి ఉంచారు.
వర్షం.. గుజరాత్ ప్లేయర్ల తీవ్ర ఇబ్బందులు
ఈ వాతావరణ ప్రభావం గుజరాత్ టైటాన్స్ జట్టుపైన పడింది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై జీటీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం మే 30న చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు గుజరాత్ ప్లేయర్లు బయలుదేరాల్సి ఉంది. కానీ తుఫాను కారణంగా విమాన అనుమతులు ఆలస్యమవ్వడంతో శనివారం రాత్రి ప్లేయర్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ప్లే ఆఫ్స్ దశలో గుజరాత్ టైటాన్స్‌కు విపరీతమైన ప్రయాణ భారం పడింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో ఆడిన జట్టు.. అక్కడి నుంచి క్వాలిఫయర్-1 కోసం ధర్మశాలకు వెళ్లింది. ఆర్సీబీ చేతిలో ఓడిన అనంతరం మళ్లీ ముల్లాన్‌పూర్‌కు చేరుకుని క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్ కోసం మరోసారి అహ్మదాబాద్‌కు చేరుకుంది.
క్వాలిఫయర్-2, ఫైనల్ మధ్య కేవలం ఒక్కరోజు విరామమే ఉండటం.. వాతావరణం కారణంగా విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో గుజరాత్ జట్టుకు విశ్రాంతే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హోం గ్రౌండ్‌లో ఫైనల్ ఆడనున్న గుజరాత్ టైటాన్స్‌కు వాతావరణం కూడా మరో సవాల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
రెజ్లింగ్ ట్రయల్స్‌లో ఓటమిపాలైన వినేశ్
ఐపీఎల్2026: సన్ రైజర్స్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్