ఐపీఎల్2026: సన్ రైజర్స్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ABN , Publish Date - May 30 , 2026 | 05:27 PM
క్వాలిఫయర్- 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి తెరపడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు ఓటమిపాలైనప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి తెరపడింది. నిన్న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడి.. మరోసారి ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాయల్స్ జట్టు బ్యాటింగ్ పరంగా రాణించినప్పటికీ, బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. అయితే ఈమ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు ఓటమిపాలైనప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రాజస్థాన్ చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో ఆర్ఆర్ జట్టు ఏకంగా 181 కొట్టింది. గతంలో ఈ రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరిట ఉండి. ఆ జట్టు 2024 సీజన్‌లో 178 సిక్సర్లు కొట్టింది. ఆ రికార్డును తాజాగా రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ చేసింది. ఇక్కడ మరో విశేషం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కొట్టిన మొత్తం 181 సిక్సర్లలో, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 72 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు, 2012) రికార్డును ఈ 15ఏళ్ల యువ కెరటం బద్దలు కొట్టాడు.
వైభవ్ తర్వాత ఆర్ఆర్ జట్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే:
ధ్రువ్ జురెల్: 24
డొనవొన్ ఫెరీరా: 23
రియాన్ పరాగ్: 21