వెస్టిండీస్‌తో సిరీస్: టీమిండియాకు షాక్.. గాయపడ్డ గిల్!
ABN , Publish Date - Sep 25 , 2026 | 09:28 PM
వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్-భారత్ మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్ వేసిన బంతి వేగంగా దూసుకొచ్చి గిల్ మోచేతికి బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు.
ఫిజియోలు దాదాపు 20 నిమిషాల పాటు గిల్‌కు చికిత్స అందించారు. కొంతసేపటి తర్వాత గిల్ తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్‌కి వచ్చినప్పటికీ.. అతడి గాయంపై అధికారికంగా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఆదివారం జరగనున్న తొలి వన్డేకు గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
నెట్స్‌లో కోహ్లీ-రోహిత్..
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్‌లో కలిసి బ్యాటింగ్ చేశారు. పక్కపక్కనే ఉన్న నెట్స్‌లో దాదాపు 20 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత క్రికెటర్లతో పాటు స్థానిక నెట్ బౌలర్లు వేసిన బంతులను ఎదుర్కొంటూ ఇద్దరూ చక్కగా ఆడారు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అతడు బరిలోకి దిగనున్న నేపథ్యంలో అభిమానుల దృష్టి కూడా అతడిపైనే ఉంది.
సీనియర్ల అనుభవం కీలకం: మోర్కెల్
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టులోని సీనియర్ ఆటగాళ్ల అనుభవం, వారి మధ్య జరుగుతున్న చర్చలపై ప్రశంసలు కురిపించాడు. ‘శుభ్‌మన్ గిల్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే సీనియర్ ఆటగాళ్లు జట్టును చక్కగా తీర్చిదిద్దగలరని నేను ఎప్పుడూ నమ్ముతాను. జట్టులోని యువ ప్లేయర్లు సీనియర్లతో మాట్లాడేందుకు ఎక్కువగా ఇష్టపడవచ్చు. మా అదృష్టం కొద్దీ జట్టులో ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల మధ్య మంచి చర్చలు జరుగుతున్నాయి. ఇది జట్టుకు ఎంతో ఉపయోగకరం’ అని మోర్కెల్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: సత్తా చాటిన గుల్వీర్ సింగ్.. భారత్‌కు రజతం
ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ అనూహ్య ఓటమి.. తప్పెక్కడ జరిగిందంటే?