Share News

ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ అనూహ్య ఓటమి.. తప్పెక్కడ జరిగిందంటే?

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:50 PM

ఆసియా క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌-చిరాగ్ శెట్టి ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జోడీ.. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.

ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ అనూహ్య ఓటమి.. తప్పెక్కడ జరిగిందంటే?
Satwik Chirag

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌-చిరాగ్ శెట్టి ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జోడీ.. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన పక్కపోన్-పీరాచై సుక్ఫున్ చేతిలో 21-12, 19-21, 14-21తో పరాజయం చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ గెలిచిన సాత్విక్-చిరాగ్.. ఆ తర్వాత పట్టు కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థులకు అప్పగించారు. ఓటమి అనంతరం సాత్విక్, చిరాగ్ స్పందించారు.


మరింత బలంగా తిరిగొస్తాం: సాత్విక్

‘మా ఆట కాస్త తడబడింది. తొలి గేమ్‌లో చాలా బాగా ఆడాం. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని మాకు తెలుసు. టీమ్‌ ఈవెంట్‌లో వరుసగా ఆడటంతో ఒత్తిడి ఉంటుంది. నిన్న రాత్రి 12 గంటల వరకు మ్యాచ్‌లోనే ఉన్నాం. వెంటనే వచ్చి ఇక్కడ బలమైన జోడీతో పోటీ పడాల్సి వచ్చింది. ఇది అంత సులభం కాదు. అయినా అందుకు సిద్ధమయ్యాం. మేం మానసికంగా స్వేచ్ఛగా ఆడినప్పుడు మమ్మల్ని ఎవరూ ఓడించలేరు. కానీ ఎక్కడైనా ఆలోచనల్లో చిక్కుకుపోతే ప్రత్యర్థులకు అవకాశం దొరుకుతుంది. ఆటలో గెలుపోటములు సహజమే. దీని నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగడం వల్ల ఒత్తిడేమీ లేదు. కానీ టోర్నీకి ముందు మానసికంగా ఎలా సిద్ధమవుతున్నామన్నదే ముఖ్యం’ అని సాత్విక్ వెల్లడించాడు.


ఇంకాస్త తెలివిగా ఆడాల్సింది: చిరాగ్

చిరాగ్‌ శెట్టి కూడా ఓటమిపై స్పందించాడు. తొలి గేమ్‌లో బాగా ఆడినా.. రెండు, మూడో గేమ్‌ల్లో తమ వ్యూహం సరిగ్గా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ‘మేం అనుకున్న స్థాయిలో ఆడలేదు. తొలి గేమ్‌ను బాగా ప్రారంభించాం. కానీ రెండు, మూడో గేమ్‌ల్లో సరిగ్గా ఆడలేకపోయాం. వాళ్లు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. థాయ్‌లాండ్ జోడీ ఎక్కువగా క్రాస్‌ షాట్లు ఆడతారని మాకు తెలుసు. మేం ఇంకాస్త ప్రశాంతంగా, తెలివిగా ఆడాల్సింది. ఆ తర్వాత వాళ్లు మమ్మల్ని తిరిగి మ్యాచ్‌లోకి రానివ్వలేదు. వారికి క్రెడిట్‌ ఇవ్వాలి. అయితే మేం ఇంకాస్త తెలివిగా ఆడాల్సింది’ అని చిరాగ్‌ చెప్పాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: నేపాల్ చేతిలో అఫ్గానిస్థాన్‌ చిత్తు.. క్వార్టర్స్ బెర్తుపై ఉత్కంఠ

ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా

Updated Date - Sep 25 , 2026 | 05:51 PM