ఆసియా క్రీడలు: తమిళనాడు అథ్లెట్లకు సీఎం విజయ్ భారీ నజరానా
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:47 PM
ఆసియా క్రీడల్లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో భాగమైన తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ చెరో రూ.50లక్షల నజరానా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం సి. జోసెఫ్ విజయ్ నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తాజాగా 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో భాగమైన తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ.50లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు సీఎంఓ ఎక్స్ వేదికగా అథ్లెట్లను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మహిళా క్రికెట్ జట్టులో భాగమైన యువ ప్లేయర్ జి.కమలినికి సీఎం విజయ్ రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజత పతకం సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. నలుగురు సభ్యులున్న భారత మిక్స్‌డ్ రెలే జట్టులో ఇద్దరు తమిళనాడుకు చెందిన అథ్లెట్లు ఉండటం రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణం. విద్య రామరాజ్, విశాల్‌ల ప్రతిభను గుర్తించి తమిళనాడు ప్రభుత్వం చెరో రూ.50లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించింది. వీరిద్దరూ తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT)కి చెందిన ‘ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్’ కింద ఆర్థిక సాయం పొందనున్నారు. విద్య, విశాల్ సాధించిన విజయం క్రీడల్లో రాణించాలనుకునే యువతకు స్ఫూర్తినిస్తుంది. భారత్‌తో పాటు తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన వీరిద్దరూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని సీఎం విజయ్ పేర్కొన్నారు.
మిక్స్‌డ్ రిలేలో రజతం
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో విద్య రామరాజ్, విశాల్, మను, పూవమ్మ కలిసి భారత్ తరఫున బరిలోకి దిగారు. భారత్ 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం సాధించింది. బహ్రెయిన్ 3:12.87 సెకన్లతో గేమ్స్ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకుంది. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు ఇది వరుసగా మూడో ఆసియా క్రీడల పతకం. 2018లో ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు భారత్ స్వర్ణం సాధించింది. 2022లో రజతం గెలిచిన భారత బృందం.. తాజాగా మరోసారి రజతంతో సరిపెట్టుకుంది.
ఇవీ చదవండి: